నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి !
posted on Sep 10, 2025 7:24PM
.webp)
తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీని ఆందోళనకారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నిరసనకారులతో వర్చువల్‌గా సమావేశమైన సుశీల ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమె నేతృత్వంలో ఆర్మీ చీఫ్‌తో చర్చలకు నిరసనకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న యువత ఈ చర్చల్లో పాల్గొనొద్దన్న నిబంధనలకు జెన్ జీ అంగీకరించినట్లు తెలుస్తోంది.సుశీలా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
జనరల్-జెడ్ వర్చువల్ సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదిరింది. సమాచారం ప్రకారం, దాదాపు 5000 మంది వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. సుశీలా కర్కి నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఆమె జూన్ 7, 1952న మొరాంగ్ జిల్లాలోని బిరత్‌నగర్‌లో జన్మించారు. ఆమె మహేంద్ర మొరాంగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. దీని తరువాత, ఆమె నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందింది.