నీటుగా తాట తీస్తున్నారు

 

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం ఒక ఉమ్మడి పరీక్షను నిర్వహించి తీరాలంటూ ఎట్టకేలకు సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని తెలియచేసింది. దాదాపు నెల రోజుల నుంచీ తాము ఎంసెట్ ద్వారానే వైద్య కోర్సులలోకి అనుమతిని అందిస్తామంటూ తెలుగు రాష్ట్రాలు, సుప్రీం కోర్టు ముందు చేసిన వాదనలన్నీ ఈ తీర్పుతో కొట్టుకుపోయాయి. కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ తీర్పు చాలామందికి శరాఘాతంగా తగిలింది. నామమాత్రంగా ఏదో ఒక పరీక్షని నిర్వహించేసి విద్యార్థులను అనుమతించే ప్రైవేటు కాలేజీలు, ఇష్టారాజ్యంగా తమకు తోచిన వారిని చేర్చుకునే మైనారటీ కాలేజీలు ఇక నుంచి నీట్‌ పరీక్ష ఆధారంగానే అడ్మషన్లను చేపట్టవలసి ఉంటుంది. ఇక ఎలాంటి ప్రవేశ పరీక్షా లేకుండా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య పరీక్షలకు అనుమతించే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా ఈ తీర్పు ఓ భంగపాటు.

 

ఎందుకీ నీట్‌!

అసలు నీట్‌కి రూపకల్పన చేసిన ప్రయోజనం వేరు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నా 15 శాతం సీట్లలో స్థానికేతరులకు అవకాశాన్ని కల్పించేందుకు AIPMT పేరుతో ఒక పరీక్షను నిర్వహించేవారు. కానీ ఇదే పరీక్షను అన్ని సీట్లకూ ఎందుకు అమలు చేయకూడదంటూ వాదనలు మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న రిజర్వేషన్లకు భంగం కలిగించకుండానే ఈ పరీక్షను అమలు చేయవచ్చంటూ ప్రభుత్వం భావించింది. దాంతో 2013లో తొలిసారి ఈ పరీక్షను అమలుచేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల గగ్గోలు పెట్టిన వివిధ పక్షాలు సుప్రీం కోర్టులో 100కు పైగా కేసులను దాఖలు చేశాయి. ఆశ్యర్యంగా ఆనాటి సుప్రీం కోర్టు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు చెల్లవని తీర్పునివ్వడమే కాకుండా, ఇలాంటి పరీక్ష రాజ్యాంగవిరుద్ధమంటూ తీర్పునిచ్చింది.

 

మరి ఇప్పుడేమొచ్చింది!

సుప్రీం కోర్టు మళ్లీ తను ఇచ్చిన తీర్పుని తానే తోసిరాజంటూ నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌- NEET)ని నిర్వహించేందుకు ఈ ఏడాది అనుమతినిచ్చింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు, ప్రైవేటు కళాశాలలు గుండెలు బాదుకుంటూ కోర్టు ముందు తమ వాదనలు మొదలుపెట్టాయి. కానీ నీట్‌ ద్వారానే వైద్య విద్యలోకి అనుమతిని సాధించాలంటూ సుప్రీం స్పష్టం చేసేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 400కి పైగా వైద్య కళాశాలలలోకి అనుమతి కోసం దాదాపు 35 ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారనీ... ఇక మైనారటీ, ప్రైవేటు కళాశాలలైతే డబ్బు కోసం ఇష్టారాజ్యంగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయనీ వచ్చిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కనీసం ఈ ఒక్క ఏడాదైతే నీట్‌ నుంచి మినహాయింపుని ఇవ్వమంటూ తెలుగురాష్ట్రాలు చేసిన అబ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ ఏడాది జులై 24న నీట్‌ పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.

 

నీట్‌తో సమస్య ఏమిటి!

సుప్రీం కోర్టు చెబుతున్నట్లుగా దేశవ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం ఉండటం, అవకతవకలకు ఆస్కారం తగ్గిపోవడం అన్నది వినడానికి బాగానే ఉంది. కానీ నీట్‌ పరీక్షలోని సిలబస్‌ కానీ, పరిక్షా పత్రం తీరు కానీ, మార్కులు అందించే విధానం కానీ... ఎంసెట్‌ను పోలి ఉండవు. నీట్‌ను రాసే విద్యార్థులంతా చచ్చినట్లు సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రకారమే పరీక్షను సిద్ధపడాలి. అది కూడా ఆంగ్లంలోనే రాయాల్సిన అగత్యం రావచ్చు. ఇక తప్పైన జవాబు వారా మార్కులను తగ్గించడం కూడా మరో కొత్త సమస్య! వీటి వల్ల మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు నానా అగచాట్లకు గురికావలసి వస్తుందన్నది వివిధ వర్గాల ఆందోళన. పైగా ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు ఎంసెట్‌ను రాసేశారు. దాని ఫలితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మరో రెండు నెలల్లో పూర్తి భిన్నమైన పరీక్షకు సిద్ధం కావడం అంటే, పూర్తిగా సెంట్రల్‌ సిలబస్ మీద పట్టున్న వారికే అది సాధ్యపడుతుంది. ఇది నిజంగానే ప్రభుత్వ విద్యార్థులకు ఓ పీడకలలా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

 

ఇలా ఒకటీ రెండూ కాదు... నీట్‌కి అటు అనుకూలంగానూ, ఇటు వ్యతిరేకంగానూ చెలరేగుతున్న వాదనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు ఓ తుది నిర్ణయంగా భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ తీర్పుని వెలువరించింది ఒక త్రిసభ్య ధర్మాసనం మాత్రమే! మళ్లీ ఈ సమస్య విస్తృత ధర్మాసనం ముందుకి చేరితేనే కానీ కరాఖండిగా తీర్పు వెలువడే అవకాశం ఉండదు. మరి అప్పటి వరకూ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటన్నదే ప్రశ్న. సుప్రీం కోర్టు వంటి ఉన్నత న్యాయస్థానం సైతం ఒకోసారి ఒకలా, మరోసారి ఇంకోలా తీర్పులను వెలువరించడం... ఇప్పటికిప్పుడే తమ తీర్పులు అమలు కావాలంటూ పట్టుపట్టడం ఎంతవరకు సబబన్నదే సామాన్యుడి బాధ!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu