బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు కొలిక్కి
posted on Oct 14, 2025 10:53AM

దేశ వ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖారరయ్యాయి. రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 6న తొలి విడత, 11న మలివిడత పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధానంగా ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే పోరు ఉన్నా.. జనసురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం కీలక పాత్ర పోషించనున్నారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ బీహార్ పరిస్థితి, ప్రజల మొగ్గు ఏ కూటమి వైపు అన్న కోణంలో జరిగిన పలు సర్వేలు కూడా ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా అవతరించే అవకాశాలున్నాయనే పేర్కొన్నాయి. అటువంటి ప్రశాంత్ కిశోర్ ఎన్డీయే, ఇండియా కూటముల కంటే ముందే తన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. విద్యావంతులు, మేధావులతో కూడిన ఆ జాబితా విస్మయ పరిచింది. రాజకీయ నేపథ్యం ఇసుమంతైనా లేనివారికే ఆయన తొలి జాబితాలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు కేటాయించారు. అదలా ఉంచితే..
అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్డీయే, ఇండియా కూటములు మాత్రం పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. అసమ్మతులను బుజ్జగించి జాబితాలను ప్రకటించడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు సోమవారం (అక్టోబర్ 13) నాటికి ఓ కొలిక్కి వ చ్చింది. ఆ సర్దుబాటు ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 243 నియోజకవర్గాలకు గాను కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలలోనూ పోటీ చేయనున్నాయి.
సద్దుబాటులో భాగంగా కూటమి భాగస్వామ్య పక్షమైన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్-విలాస్)కి 29 సీట్లు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) , రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా కు చెరో ఆరు సీట్లు కేటాయించారు. ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం సజావుగా పూర్తయ్యిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ థృవీకరించారు. ఇక ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు.