ఎర్ర సముద్రంలో నౌకా దిగ్బంధనం: పెరగనున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణ ముప్పు.!

posted on: Jul 25, 2026 3:05PM

మధ్యప్రాచ్యంలో  నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు రవాణా వ్యవస్థను తీవ్రాతి తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేశాయి.  ఎర్ర సముద్రంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో దాడులు హెచ్చడంతో..  సౌదీ అరేబియా నుంచి భారత్, చైనాలకు బయలుదేరిన క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు తమ మార్గాన్ని మార్చుకోకతప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. మామూలుగా బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి గుండా వెళ్లాల్సిన నౌకలు ఇప్పుడు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టి గుడ్ హోప్ అగ్రం మీదుగా తమ మార్గాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. దీనివల్ల రవాణా సమయం  పెరగడమే కాకుండా..   ఇండియాకు ఆర్థికంగా కూడా   లక్ష కోట్ల రూపాయల అదనపు భారం పడే ప్రమాదం ఏర్పడింది.  

ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు నౌకలపై ఇటీవల దాడుల ముప్పు ఎక్కువైంది. సౌదీ అరేబియాలోని యంబు నౌకాశ్రయం నుంచి భారత పశ్చిమ తీరానికి రావాల్సిన నౌకలు సాధారణంగా 19 రోజుల్లో చేరతాయి. అయితే, ప్రస్తుత భద్రతా కారణాల వల్ల ఈ నౌకలు ఎర్ర సముద్రంలో యూ-టర్న్ తీసుకుని, సూయెజ్ కాలువ, మధ్యధరా సముద్రం,  ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా గుడ్ హోప్ అగ్రం చుట్టి రావాల్సి వస్తోంది. ఈ కొత్త మార్గం వల్ల ప్రయాణ సమయం  48 రోజులకు పెరుగుతుది.  ఈ మార్పుల వల్ల కేవలం సమయం మాత్రమే కాదు, ఇంధన ఖర్చులు,  నౌకల అద్దెలు కూడా భారీగా పెరిగాయి. సాధారణ మార్గంలో ఒక్కో ట్రిప్పుకు ఇంధన ఖర్చు సుమారు 12.6 లక్షల డాలర్లు ఉంటే, ఆఫ్రికా చుట్టూ తిరగడం వల్ల అది 28.7 లక్షల డాలర్లకు పెరిగింది. దీనికి తోడు నౌకలకు చెల్లించే రోజువారీ అద్దె   300 శాతానికి పైగా పెరిగింది. సూయెజ్ కాలువ రుసుములు,  ఇతర నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే, ఒక్కో బ్యారెల్ చమురుపై రవాణా ఖర్చు దాదాపు  3 డాలర్ల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

సముద్ర మార్గంలో పెరిగిన ప్రమాదాల కారణంగా బీమా కంపెనీలు కూడా తమ వార్ రిస్క్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను భారీగా పెంచేశాయి. సాధారణంగా నౌక విలువలో పావు తానం ఉండే బీమా ప్రీమియం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా  5 శాతానికి చేరింది. ఉదాహరణకు, 16 కోట్ల డాలర్ల విలువైన ఒక పెద్ద చమురు ట్యాంకర్ ఒక్కసారి ప్రయాణించాలంటే కేవలం బీమా కోసమే 80 లక్షల డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ అదనపు భారం చివరకు చమురు కంపెనీల ద్వారా వినియోగదారుల పైనే పడుతుంది.  భారతదేశం తన వార్షిక చమురు అవసరాలలో దాదాపు 85 శాతాన్ని విదేశీ దిగుమతుల ద్వారానే పొందుతోంది. అందులో సౌదీ అరేబియా నుంచి రోజుకు 4 లక్షల బ్యారెళ్లకు పైగా క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతోంది. పెరిగిన రవాణా సమయం, అధిక ఇంధన ఖర్చులు, ప్రీమియంల కారణంగా భారత్ పై ఏడాదికి దాదాపు  లక్ష కోట్ల రూపాయల  అదనపు భారం పడే అవకాశం ఉంది. ముడి చమురు ధర  ఒక్క డాలర్ పెరిగినా, భారత్ దిగుమతి బిల్లు ఏకంగా 2 బిలియన్ డాలర్లు పెరుగుతుందని ఆర్థిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  

ఈ సముద్ర మార్గాల సంక్షోభం కేవలం చమురు దిగుమతులకు మాత్రమే పరిమితం కాకుండా, భారత్ నుంచి జరిగే ఎగుమతులపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. యూరప్ మరియు ఇతర పశ్చిమ దేశాలకు భారత్ నుంచి వెళ్లే సరుకు రవాణా నౌకలు కూడా గుడ్ హోప్ అగ్రం మీదుగానే వెళ్లాల్సి రావడంతో ఎగుమతులు 20 నుంచి 30 రోజులు ఆలస్యమవుతున్నాయి. కంటైనర్ రవాణా ఛార్జీలు కూడా రెట్టింపు కావడంతో భారతీయ ఎగుమతిదారులు విదేశీ మార్కెట్లలో పోటీపడటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

ఇండియా  వద్ద ప్రస్తుతం కొన్ని వారాలకు సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు  ఉన్నప్పటికీ, సుదీర్ఘకాలం ఈ సంక్షోభం కొనసాగితే ఇంధన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం సవాలుగా మారనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉంది. దీనివల్ల దేశంలో సామాన్య ప్రజలపై ద్రవ్యోల్బణ భారం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రత పునరుద్ధరణ కానంత వరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం లేదు. ప్రపంచ దేశాలు మరియు సముద్ర భద్రతా దళాలు కలసికట్టుగా చర్యలు చేపట్టి, బాబ్ ఎల్-మాండెబ్ వంటి కీలక జలసంధుల్లో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత ఖరీదైన ప్రత్యామ్నాయంగా మారిన గుడ్ హోప్ అగ్రం మార్గం భారత్ తో పాటు అనేక ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తూనే ఉంటుంది.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

Red Sea crisis, Bab el-Mandeb Strait, burden of oil transport, Cape of Good Hope, rise in fuel prices

google-ad-img
    Related Sigment News
    • Loading...