బీ కేర్‌ఫుల్‌.. వ‌దిలిపెట్టం.. వేటాడ‌తాం.. లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్‌..

మేము సింహం లాంటి వాళ్లం.. అరాచ‌కాల‌కు భ‌య‌ప‌డి పారిపోయే వాళ్లం కాదు.. మిమ్మల్ని వదిలిపెట్టం.. వేటాడతాం.. మా ఓపిక‌ను ప‌రీక్షించొద్దు.. స‌మ‌యం వ‌స్తుందు.. నేనే గుణ‌పాఠం చెబుతా.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో 27 మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపారని మండిప‌డ్డారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు జరుగుతున్నాయని.. ప్రజల ప‌క్షాన పోరాడుతున్న వారిపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. 

కర్నూలు జిల్లా పెసరవాయిలో హత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలను నారా లోకేశ్‌ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను కోల్పోయామని..  బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని.. అన్ని రకాలుగా ఆ కుటుంబాలను ఆదుకుంటామ‌ని.. నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

  

‘‘టీడీపీ కార్యకర్తలను బెదిరించి, నాయకులను చంపితే మేం వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టం. మా కార్యకర్తలను భయపెడితే పార్టీకి నష్టం తేవచ్చని మీరు అనుకుంటున్నారు. టీడీపీ ఎక్కడికీ పోదు. మేం మీకు భయపడి పారిపోయేవాళ్లం కాదు. ధైర్యంగా నిలబడి ప్రజల తరఫున పోరాడతాం. మా ఓపికను పరీక్షించొద్దు.. బీ కేర్‌ఫుల్‌. సమయం వస్తుంది.. అప్పుడు నేతలు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులకు గుణపాఠం చెప్పే బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని టీడీపీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా’’ అని లోకేశ్‌ అన్నారు.  

మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయండి. రాయలసీమకు కొత్త పరిశ్రమలు తీసుకురండి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయండి. అవి మీకు చేతకాకే మా కార్యకర్తలు, నేతలపై ఎదురుదాడి చేస్తున్నారని నారా లోకేశ్ మండిప‌డ్డారు.  

క‌ర్నూలు జిల్లా పెస‌ర‌వాయికి చెందిన టీడీపీ నేత‌లు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి గురువారం ఉదయం శ్మశానానికి వెళ్తుండ‌గా.. ప్ర‌త్య‌ర్థులు మాటు వేసి హ‌త‌మార్చారు. పక్కా ప్రణాళికతో కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లు, గొడ్డళ్లతో నరికి వారిని దారుణంగా చంపేశారు. ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. వైసీపీ నాయ‌కులే ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఆ రెండు వ‌ర్గాల‌కు ఎప్ప‌టినుంచో గొడ‌వ‌లు ఉన్న‌ట్టు స‌మాచారం.