కుట్రలు కాదు వ్యాక్సిన్లు కావాలి! జగన్ కు లోకేష్ లేఖ 

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ వ్యాక్సిన్లపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఏపీకి ఎక్కువగా వ్యాక్సిన్లు రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ స్లోగా సాగుతుండటం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. వ్యాక్సిన్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు ప్రజల ప్రాణాలు అని ఆయన అందులో తెలిపారు. ఇప్పటికైనా స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీఎం జగన్ కు సూచించారు లోకేష్.

కరోనా మరణాల సంఖ్య 9 వేలు దాటుతున్న వేళ, ప్రాణాలు నిలిపే వ్యాక్సిన్ల కోసం సీఎం జగన్ కేంద్రాన్ని  డిమాండ్ చేయలేకపోవడం విచారకరం అన్నారు నారా లోకేష్. వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా డోసులు సేకరించేందుకు ఏప్రిల్ 20 నుంచి 29వ తేదీ మధ్యన మన రాష్ట్రానికి అవకాశం వచ్చినా స్పందించలేదని లోకేశ్ ఆరోపించారు. అదే సమయంలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ఒక్కొక్కటి 3 కోట్ల వ్యాక్సిన్ డోసులకు పైగా ఆర్డర్లు చేశాయని వెల్లడించారు.ఏపీలోని ప్రతి పౌరుడికి టీకా ఇవ్వడంలో ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.

"రాష్ట్ర ప్రజలు మీ నుంచి వ్యాక్సిన్లు కోరుకుంటున్నారు... కుట్రలు కాదు. మేం మీ నుంచి సమాధానాలు కోరుకుంటున్నాం... ప్రకటనలు కాదు. మేం మీ మంత్రుల నుంచి చర్యలను కోరుతున్నాం... వాక్చాతుర్యం, సహజీవనం కాదు. మీరు పరిస్థితులకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మేం కోరుకుంటున్నాం... కుంటిసాకులు చెప్పడంకాదు" అని పేర్కొన్నారు.