మునుగోడు ఉప ఎన్నిక.. నేతల దూకుడుకు.. కేసీఆర్ బ్రేక్ .. అందుకేనా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా చేశారు. క్షణాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజగోపాల రెడ్డి పేరు పక్కన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే.. కూడా వచ్చిచేరింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరడం కూడా ఖరారైపోయింది. ఆగష్టు 21 న రాజగోపాల రెడ్డి  ఖద్దరు విడిచి కాషాయం కట్టేందుకు సిద్దమయ్యారు. అందుకు ముహూర్తం ఖరారైంది.

ఈ నేపధ్యంలో ఆయన రాజకీయ జీవితం కొత్త మలుపు తీసుకుంటోందని అనుకోవచ్చును. గతాన్ని గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం)కు అప్పగించి, ఆ ఎదురుగా అడుగుల దూరంలో ఉన్న డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ రాష్ట్ర కార్యాలయం) నుంచి కొత్త నడక ప్రారంభమవుతుంది. ఒక విధంగా ఆయన రాజకీయ జీవితంలో మరో అధ్యాయం మొదలవుతోంది.  అదలా ఉంటే, రాజగోపాల రెడ్డి రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదిస్తారా, జాగు చేస్తారా, అనే అనుమనాలు కూడా తీరిపోయాయి. రాజగోపాల రెడ్డి ఇలా రాజీనామా లేఖ ఇచ్చిన వెంటంటే స్పీకర్ పోచారం అలా  అక్కడిక్కడే ఆమోదం తెలిపారు. ముద్ర పడిపోయింది. సో.. ఇక మునుగోడు సీటు ఖాళీ అయింది. ఉపఎన్నిక అనివార్యం అనే విషయంలో స్పష్టత వచ్చింది. అయితే ఎప్పుడు.. కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్‌, డిసెంబర్‌లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు, ఆగుతుందా, ఆనవాయితీకి భిన్నంగా వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు వెంటనే ఉప ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తుందా అలాగే రాష్ట్ర ప్రభుత్వం  ఏకంగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోతుందా? ఇటు కేసీఆర్, అటు అమిత్ షా వ్యూహాలు, ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, వంటి ప్రశ్నలు, సందేహాలు కొన్ని ఇంకా అలాగే ఉన్నా, రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక వేడి అయితే మొదలైపోయింది. 

గత ఎనిమిది సంవత్సరాలుగా అధికార తెరాస ఉపఎన్నికలకు ఒక ప్రత్యేక వ్యూహం (టెంప్లేట్) అమలు చేస్తోంది. ఉపఎన్నిక జరిగే నియోజకవర్గంలో ప్రతి ఓటరును ఇంటి అల్లుడిలా చూసుకుంటూ వస్తోంది. నియోజక వర్గం ప్రజలు అడిగినవి, అడగనవి, అడిగినా అంతవరకు పట్టించుకోని పనులన్నీ చకచకా కానిస్తోంది. ఇతర నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంటింటికీ వెళ్లి, ఇంటిల్లిపాది యోగాక్షేమాలు తెలుసు కుని, ఇంట్లో ఉన్న ఓట్ల లెక్కన కవర్లు చేతిలో పెట్టి వచ్చారు. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నుంచి తాగినోడికి తాగినంత తిన్నోనికి తిన్నంత అన్న విధంగా, ఇంట్లో పొయ్యి రాజేయవలసిన అవసరం లేకుండా ప్రజల అవసరాలన్నీ అధికార పార్టీ,  శ్రీ సర్కార్ వారు, గౌరవ ప్రజా ప్రతినిధులు, పెద్దలు చూసుకున్నారు. హుజూర్ నగర్ నుంచి హుజురాబాద్ వరకు అదే పద్దతి కొనసాగింది. హుజురాబాద్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. దేశ చరిత్రలో ‘అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక’ గా హుజురాబాద్ చరిత్రను సృష్టించింది.  

నిజానికి రాజగోపాల రెడ్డి, రాజీనామాకు ఇది కూడా ఒక కారణంగా ఆయన చెప్పు కుంటున్నారు. ఉప ఎన్నిక వస్తే నిధులొస్తాయి,దళిత బంధు వంటి పథకాలు అమలవుతాయి, పనులవుతాయి, పెన్షన్లు, రేషన్ కార్డులు వస్తాయి,అందుకే, నియోజక వర్గం ప్రజలకు మేలుకోరి రాజీనామా చేస్తున్నానని ప్రకటించు కున్నారు. సరే ఆయన మాటలు నమ్మినోళ్లు నమ్ముతారు లేనోళ్ళు లేదనుకోండి, అది వేరే విషయం.  అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక, హుజురాబాద్ నవ్వుల పాలైన ఫార్ములానే ముగోడులో ఫాలో అవుతారా? వరసగా మూడవ (హ్యాట్రిక్) ఓటమి నుంచి తప్పించుకునేందుకు కొత్త వ్యూహం అమలు చేస్తారా? అంటే, గత అనుభవాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాన్ని మార్చుకునే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అంతే కాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే పార్టీ నాయకులకు ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాజగోపాల రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైన నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్  సోమవారం (ఆగస్టు 8) హైదరాబాద్ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభ వేడుడుకల అనతరం, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర జిల్లా నేతలతో సమావేశమైనట్లు సమాచారం . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉపఎన్నికకు సన్నద్ధం కావాలని ఆదేశిస్తూనే,  మునుగోడు ఉప ఎన్నికపై అనవసరంగా హైరానా పడద్దు అనే సూచన కూడా చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా  తిపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నారు. వారు తీసుకున్న గోతిలో వారే పడతారు. మన పని మనం మెల్లిగా చేసుకుంటూ పోదాం  అంటూ నాయకుల దూకుడుకు బ్రేకులు వేసినట్లు తెసుస్తోంది.

అంతకంటే ముఖ్యంగా రాజగోపాల రెడ్డి రాజీనామాతో ప్రోటోకాల్ సమస్యలు తొలిగి పోయినా కారణంగా ఇక నియోజక వర్గంలో పందారం కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ప్రారంభిద్దామని కొందరు నాయకులు సూచించినా ... ముఖ్యమంత్రి,  తొందర వద్దు  .. నింపాదిగా ఆలోచిద్దాం, మరో రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికల వ్యూహం, కార్యాచరణ ఖరారు చేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. అంటే, ఒకటికి రెండు సార్లు విఫలమైనా ఫార్ములాను మళ్ళీ అమలు చేసి మళ్లీ నవ్వులపాలు కాకూడదని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లుగా ఉందని, తెరాస ముఖ్యనేత ఒకరు చెప్పారు. మరోవంక, మంత్రి కేటీఆర్ కూడా, ‘మునుగోడు’ మరో ఉప ఎన్నిక,అంతకు మించి ప్రత్యేకత ఏమీ లేదని తేల్చేశారు.

అంటే, ఓడినా, హుజురాబాద్ లో లా కాకుండా కాసింత హుందాగా ఓడిపోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెస్లుస్తోంది. అదీగాకా, హుజురాబాద్ లో లాగా కోట్లు కుమ్మరిస్తే జనం అందుకు కారణమా అయిన రాజగోపాల రెడ్డికి కృతజ్ఞతను చూపుతారనే కారణంతో పాటుగా జీతాలకే దిక్కులేని పరిస్థితి హుజురాబాద్ స్థాయిలో ప్రభుత్వ ఖజానా నుంచి కాసులు కుమ్మరించడం కుదిరే పని కాదని, ఆ పోలిక తేవడం వలన నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి, భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి ఆచి తూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.