హైద‌రాబాద్‌కు ర‌ఘురామ త‌ర‌లింపు.. ప‌ర్య‌వేక్షిస్తున్న ఏపీ సీఎస్‌..

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రఘురామకు పోలీస్‌ ఎస్కార్ట్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ రక్షణ కల్పించారు. రోడ్డు మార్గంలో ఆయ‌న‌ను కారులో తీసుకు వ‌స్తున్నారు. మొత్తం వ్య‌వ‌హారాన్ని ఏపీ సీఎస్ ఆదిత్య‌నాథ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.. మెయిల్‌, ఫోన్ ద్వారా కోర్టు ఉత్త‌ర్వుల‌ను సీఎస్‌తో పాటు మ‌రో న‌లుగురు అధికారుల‌కు తెలియ‌జేసిన‌ట్టు స‌మాచారం.

జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌ఘురామ‌.. కారు ఎక్కుతూ మీడియాకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు. ఎంపీ ఆర్మీ ఆస్పత్రికి చేరుకునే సమయానికి జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను తెలంగాణ హైకోర్టు అక్కడికి పంపనుంది.

ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు త‌ర‌లింపున‌కు ముందు ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు రఘురామ భార్య రమాదేవి ఫోన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని, సుప్రీంకోర్టు తీర్పు సీఐడీకి వ్యతిరేకంగా రావడంతో.. కక్ష పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సీఎస్.. గంటలోనే ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపుతామని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది.