లోక్ సభలో రఘురామ రాజే టాప్.. వైసీపీ ఎంపీలు తుస్..

పార్లమెంట్ సభ్యులు ప్రజా సమస్యలను సభలో ప్రస్తావిస్తుంటారు. ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిద్యం వహించే ఎంపీలు.. ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతారు. కేంద్ర సర్కార్ సాయం కోరుతుంటారు. తమ వాగ్దాటితో కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు సభల్లో జరిగే కీలక చర్చల్లో పాల్గొని తమ పార్టీ వాయిస్ , తమ వాయిస్ వినిపిస్తుంటారు. అయితే పార్లమెంట్ లో కొందరు ఎంపీలు యాక్టివ్ రోల్ పోషిస్తుండగా.. మరికొందరు మాత్రం మొక్కుబడిగా వెళ్లి వస్తున్నారు. ఏదో వచ్చామా వెళ్లామా అన్నట్లుగానే కొందరు వ్యవహరిస్తుంటారు. కొందరు ఎంపీలైతే సభలకు కూడా డుమ్మా కొడుతుంటారు.

లోక్ సభ సభ్యుల పనితీరుకు సంబంధించి తాజాగా ఓ సంస్థ అధ్యయనం చేసింది.  పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు సంబంధించి సంచలన అంశాలు వెలుగులోనికి వచ్చాయి. పార్లమెంట్ అధికారిక సమాచారాన్ని అసరాగా చేసుకొని ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో కొందరు ఏపీ ఎంపీల పనితీరు చాలా దారుణంగా ఉంది. కొందరైతే అసలు సభలకే వెళ్లడం లేదు. మరికొందరు సభకు వెళ్తున్నా.. సైలెంటుగా కూర్చుని వస్తున్నారు. అధికార వైసీపీ ఎంపీల పనితీరు చాలా దారుణంగా కనిపిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. లోక్ సభ హాజరు విషయంలో చివరి స్థానంలో నిలిచారు. 
కడప ఎంపీ హాజరుశాతం కేవలం 32 శాతంగా ఉంది. 

వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు హాజరు విషయంలో టాప్ లో నిలిచారు. రఘురామ లోక్ సభ హాజరు 96 శాతంగా ఉంది. లోక్ సభలో ఎంపీ రఘురామ రాజు ఇప్పటివరకు మొత్తం 50 డిబేట్లలో పాల్గొనటంతో పాటు.. 145 ప్రశ్నల్ని అడిగారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు తక్కువగా ఉన్నప్పటికి.. సభకు హాజరైన సమయంలో ఆయన ఉత్సాహంగా ప్రశ్నలు వేస్తున్నట్లు నివేదికలో తేలింది. అవినాష్ రెడ్డి ఇప్పటివరకు  146 ప్రశ్నల్ని సంధించారు. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్  హాజరు 89 శాతం ఉంటే.. 54 డిబేట్లలో పాల్గొని మొత్త 133 ప్రశ్నల్ని వేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని  హాజరు విషయంలో గల్లా జయదేవ్ కు సమానంగా ఉన్నారు.

బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో మరో ఆసక్తికర అంశం బయటికొచ్చింది. హాజరు విషయంలో అంతంతమాత్రంగానే ఉన్న నందిగం సురేష్.. సభకు హాజరైన రోజుల్లోనూ సైలెంటుగా కూర్చుని వెళుతున్నారు. ఆయన ఇప్పటివరకు లోక్ సభలో ఒక్కటంటే ఒక్క ప్రశ్న అడగని ఘనత సాధించారు. ఒక్క డిబేట్ లోనూ నందిగం సురేష్ పాల్గొనలేదు. పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రతిపక్ష టీడీపీ ఎంపీల పనితీరు కొంత బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీల తీరు మాత్రం దారుణంగా ఉంది. లోక్ సభ సభ్యుల పదవీకాలం ఇప్పటికే సగం పూర్తైంది. ఇకనైనా ఎంపీలు మేల్కొని లోక్ సభలో ప్రజా సమస్యలకు లెవనెత్తితే బాగుంటుందని ఏపీ జనాలు కోరుకుంటున్నారు.