యజ్ఞం చేస్తే కొవిడ్ మాయం.. బీజేపీ మంత్రి కొత్త మంత్రం

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇండియాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాలకుల నిర్లక్ష్యం వల్లే కొవిడ్ విజృంభించిందని వైద్య సంస్థలు చెబుతున్నాయి. అయినా మన నేతల తీరు మారడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ పై చిల్లర మాటలు మాట్లాడుతూ జనాలను గందరగోళ పరుస్తున్నారి. 

కొవిడ్ మహమ్మారికి సంబంధించి మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కొవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండేందుకు  నాలుగు రోజుల పాటు యజ్ఞం నిర్వహించాలని ఆమె సూచించారు. ఇండోర్ నగరంలో కొవిడ్ కేర్ సెంటరును ప్రారంభించిన మంత్రి ఉషాఠాకూర్ మాట్లాడుతూ  ఈ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ శుద్ధి కోసం నాలుగు రోజులు యజ్ఞం చేయండి.. ఇది యజ్ఞ చికిత్స. పూర్వ కాలంలో, మన పూర్వీకులు మహమ్మారిని వదిలించుకోవడానికి యజ్ఞ చికిత్స చేసేవారు.. ఇది పర్యావరణాన్ని శుద్ధి చేస్తోంది, దీనివల్ల కొవిడ్ మూడో వేవ్ భారతదేశాన్ని తాకదు.. అని బీజేపీ మంత్రి ఉషా వ్యాఖ్యానించారు. 

మంత్రి ఉషా ఇటీవల ఇండోర్ విమానాశ్రయంలో విగ్రహం ముందు కర్మలు చేశారు. కరోనా పోవాలంటూ ఈ కర్మలు చేశానని చెప్పారు. గతంలో మంత్రి కొవిడ్ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించినపుడు మాస్కు ధరించలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా యజ్ఞం చేస్తో కోవిడ్ పోతుందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై జనాలు ఫైరవుతున్నారు. ఇలాంటి నేతల వల్లే దేశానికి ఈ గతి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.