సీఎం జ‌గ‌న్‌కు షాక్‌!.. సీఎస్‌పై అభియోగాలు.. స‌ర్వీస్ పొడిగింపు వ‌ద్దు..

సీఎం జ‌గ‌న్‌రెడ్డి అవినీతి, అక్ర‌మాల పుట్ట అనేది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌. అందుకే, జైలుకు వెళ్లార‌ని, ప్ర‌స్తుతం బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చి పాలిస్తున్నార‌ని.. మ‌ళ్లీ త్వ‌ర‌లోనే జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దంటూ విప‌క్షాలు శ‌పిస్తుంటాయి. ఆయ‌న ఏ1 కాబ‌ట్టే త‌న చుట్టూ అవినీతిప‌రుల‌ను పెట్టుకొని పెంచి పోషిస్తున్నార‌ని మండిప‌డుతుంటాయి. ఏ1 జ‌గ‌న్‌, ఏ2 విజ‌య‌సాయిరెడ్డి నుంచి మొద‌లుపెట్టి.. ప‌లువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేల‌తో పాటు అధికారుల‌పైనా పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. తాజాగా, ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్యానాథ్‌దాస్ టార్గెట్‌గా టీడీపీ విమ‌ర్శ‌లు సంధించింది. సీఎస్ ప‌ద‌వీకాలం పొడిగించొద్దు అంటూ డీవోపీటీకి లేఖ రాయ‌డం క‌ల‌క‌లంగా మారింది. 

తీవ్ర నేరారోపణలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు తగదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్ (డీవోపీటీ)కి టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ లేఖ రాశారు. ఆ లేఖ‌లో సీఎస్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న గ‌త చ‌రిత్ర‌, కేసులు, అభియోగాల‌ను త‌వ్విపోశారు. ఆ లేఖ‌లో ఏముందంటే....  

‘‘జూన్‌ 30వ తేదీకి ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీ విరమణ చేయాల్సి ఉంది. 2013లో జగన్‌ మోహన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన క్విడ్‌ ప్రోకో కేసుల్లో ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. జలవనరుల శాఖ కార్యదర్శిగా ఇండియా సిమెంట్స్‌కు అనధికారికంగా 10లక్షల లీటర్ల నీటి కేటాయింపులో అవసరమైన సహాయ సహకారాలు అందించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఇండియా సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆదిత్యనాథ్‌దాస్‌పైనా సీబీఐ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. తర్వాతి కాలంలో తెలంగాణ హైకోర్టు దాస్‌పై ఉన్న కేసులు రద్దు చేసినప్పటికీ,  2019 సెప్టెంబరులో ఆ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తిరిగి నోటీసులు జారీ చేసింది. వ్యక్తి గత లాభాల కోసం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వ సేవలు దుర్వినియోగం చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌కు సీఎస్‌గా పదవీకాలం తదుపరి పొడిగింపు సరికాదు’’ అని కనకమేడల రవీంద్రకుమార్ డీవోపీటీకి రాసిన‌ లేఖలో తెలిపారు. 

లేఖ‌ను టీడీపీ మీడియాకూ రిలీజ్ చేయ‌డంతో.. లెట‌ర్ చూసిన వారంతా.. ఓహో జ‌గ‌న్‌రెడ్డికి అంత‌గా స‌హ‌క‌రించారు కాబ‌ట్టే.. ఇంత మంచి పోస్ట్ ద‌క్కిందా అంటూ చ‌ర్చించుకుంటున్నారు. ఇలాంటి అధికారులు ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో ఇంకా ఎంత‌మంది ఉన్నారు.. వారు ఎలాంటి కీల‌క ప‌ద‌వులు అనుభ‌విస్తున్నారో గుర్తు చేసుకుంటున్నారు.