ఇక తొలకరి పలకరింపు.. నైరుతి రుతుపవనాలోచ్చేస్తున్నాయి

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. నైరుతి ఆదివారం కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈ ఏడాది మూడు రోజులు ముందుగానే తొలకరి పలకరించనుంది. అండమాన్ నికోబార్ దీవుల నుంచి మాల్దీవులు, లక్ష్యద్వీప్ ల వరకూ రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక ఆదివారం కేరళకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  ఇప్పటికే ఉత్తర భారతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. శుక్రవారం  నుంచి ఆయా రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో 50-60 కిలోమీటర్ల వేగంతో దుమ్ముధూళితో కూడిన గాలులు వీస్తూ..భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కాగా రుతుపవనాల ప్రభావంతో కేరళ అంతటా ఆదివారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా చెదురుమదురుగా వర్షాలకు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది సాధారణ వర్ష పాతం నమోదౌతుందని పేర్కొంది.