దక్షిణాది దాదా సాహెబ్స్ వీరే!!!
posted on Sep 21, 2025 11:52AM

మలయాళ నటుడు మోహన్ లాల్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. దీంతో మరో సౌతిండియన్ ఈ అవార్డు దక్కించుకున్న వారిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇంతకీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకున్న ఫస్ట్ సౌతిండియన్ ఎవరని చూస్తే ఆయన బీఎన్ రెడ్డి. తెలుగులో పదిహేను సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన తొలి సౌతిండియన్ దాదాసాహెబ్ ఫాల్కే విన్నర్.
సెకండ్ దాదా సాహెబ్ ఫాల్కే విన్నర్స్ కోవలోకి వచ్చే మరో దక్షిణాది నటుడు పైడి జయరాజ్. నటుడు-దర్శకుడు జైరాజ్ భారతీయ చారిత్రక పాత్రల చిత్రణకు ప్రసిద్ధి. ఎన్నో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సైతం పొందారు జయరాజ్.
మూడో వ్యక్తి విషయానికి వస్తే నటుడు, దర్శక నిర్మాత కూడా అయిన ఎల్వీ ప్రసాద్. ఈయన సైతం దక్షిణాది దాదా సాహెబ్ అవార్డు విజేతల్లో ఒకరు. ప్రసాద్ మూడు భాషల్లో నిర్మించిన తొలి టాకీలో నటించడం ద్వారా ప్రత్యేకత సాధించారు. హిందీ ఆలం అరా, తమిళ కాళిదాసు, తెలుగు భక్త ప్రహ్లాద.. ఇవన్నీ 1931లో రిలీజయ్యాయి. 1965లో ప్రసాద్ స్టూడియోస్ తో పాటు 1976లో కలర్ ఫిల్మ్ లాబరేటరీ స్థాపించారు. ప్రసాద్ స్టూడియోస్ వివిధ భారతీయ భాషలలో 150కి పైగా చిత్రాలను నిర్మించడం గమనార్హం.
ఇక బి నాగిరెడ్డి. ఈ పేరు ఆ రోజుల్లో ఒక బ్రాండ్. విజయ వాహిని స్టూడియోస్ స్థాపకులు నాగిరెడ్డి. ఆ సమయంలో ఏసియాలోనే ఇదే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో కావడం విశేషం. దీంతో నాగిరెడ్డికి సైతం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.
అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమా రెండు కళ్లలో ఒకరు. ఎన్టీఆర్ తో సమానంగా తొలినాళ్లలో తెలుగు తెరను ఏలిన నటుడు. 250కి పైగా సినిమాల్లో నటించారు. అంతే కాదు అన్నపూర్ణ స్టూడియో ద్వారా ఇప్పటికీ తెలుగు సినిమాకు సేవలందిస్తూనే ఉన్నారు. నాగేశ్వరరావుకు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
దక్షిణాది నుంచి దాదా సాహెబ్ పొందిన మరో నటుడు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. 200 పైగా సినిమాల్లో నటించారాయన. 1992లో ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఘనత రాజ్ కుమార్ సొంతం. దీంతో పాటు రాజ్ కుమార్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సైతం పొందారు.
శివాజీ గణేశన్. దక్షిణాది.. మరీ ముఖ్యంగా తమిళ సినిమా మార్క్ నటనకు ముఖచిత్రం లాంటి నటుడు. భావ వ్యక్తికరణ, ప్రతిధ్వనించే స్వరానికి ప్రతీక. 1960లో ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బెస్ట్ యాక్టర్ గా అవార్డు పొందారు శివాజీ గణేశన్. ఇలాంటి అంతర్జాతీయ అవార్డు పొందిన తొలి భారతీయ నటుడు కూడా. దక్షిణాది మార్లన్ బ్రాండోగా అభివర్ణించింది ది లాస్ ఏంజిల్స్ టైమ్స్. శివాజీ గణేశన్ కూడా దక్షిణాది దాదాసాహెబ్ లలో ఒకరిగా నిలిచారు.
ఆదూర్ గోపాల్ కృష్ణన్. మలయాళ సినిమాలో కొత్త రకం సినిమా ఉద్యమానికే మార్గదర్శకుడిగా నిలిచిన దర్శకుడు. తొలి చిత్రం స్వయంవరంకే ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు పొందారాయన. ఎంతో క్లిష్టతరమైన సమస్యలను సరళీకరించి చిత్రించడంలో ఆయనకు ఆయనే సాటి. దీంతో ఆదూర్ సైతం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
యాభై ఏళ్ల సుదీర్ఘ తెలుగు చలన చిత్ర ప్రయాణంలో డి. రామానాయుడిది ఒక ప్రత్యేక అధ్యాయం.. వివిధ భారతీయ భాషల్లో 130కి పైగా చిత్రాలను నిర్మించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగులో నిర్మించినవే. 9 భాషలలో సినిమాలు తీసినందుకు గిన్నిస్ రికార్డు కూడా సాధించిన రామానాయుడు సైతం దక్షిణాది దాదా సాహెబ్స్ లో ఒకరిగా నిలిచారు.
దక్షిణాది దర్శక దిగ్గజం కే. బాలచందర్ సైతం దాదాసాహెబ్ అవార్డు విన్నరే. 1965లో మొదలైన ఆయన కెరీర్.. లో వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. అంతే కాదు 1981లో కవితాలయా అనే చిత్ర నిర్మాణ సంస్థను సైతం స్థాపించి.. తనదైన శైలిలో భిన్నమైన కుటుంబ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచారు. దీంతో బాలచందర్ కి సైతం దాదాసాహెబ్ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.
సౌండ్ రికార్డిస్ట్ గా ఫీల్డులో కెరీర్ మొదలు పెట్టిన కే. విశ్వనాథ్ అరవై ఏళ్లు సుదీర్ఘ సినీ ప్రయాణంలో.. రకరకాల చిత్రాలను తెరకెక్కించారు. వీటిలో కల్ట్ క్లాసిక్స్ అనదగిన శంకరాభరణం వంటి ఎన్నో చిత్రాలకు ప్రాణం పోశారు. ఒక సమయంలో కే విశ్వనాత్ సినిమా అంటే పడి చచ్చిపోయే పిచ్చి ఫ్యాన్స్ ఉండేవారు. దీంతో ఆయనకు ఐదు జాతీయ అవార్డులు సైతం వచ్చాయి. తనదైన సినీ నైపుణ్యానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సైతం పొందిన కేవీ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సైతం పొందారు.
ఇక రజనీకాంత్ సంగతి సరే సరి. అపూర్వ రాగంగళ్ అంటూ 1995లో మొదలైన రజనీ సినీ కెరీర్.. తర్వాతి రోజుల్లో తమిళ మాస్ మూవీకే కేరాఫ్ గా నిలిచింది. సూపర్ స్టార్ గా అవతరించి తమిళ ప్రేక్షఖ హృదయాల్లో చోటు సంపాదించారు. ఇప్పటికే పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందిన ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం పొంది దక్షిణాది సినిమాకు మరో గౌరవం తీసుకొచ్చి పెట్టారు.
వహీదా రెహమాన్.. రోజులు మారాయి అనే సినిమాతో తెరంగేట్రం చేసిన వహిదా రెహమాన్ తర్వాతి కాలంలో ఎన్నో హిందీ సినిమాల్లో నటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ తో పాటు.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సైతం పొంది దక్షిణాదికి గౌరవం తీసుకొచ్చి పెట్టారీ తమిళనాడులో పుట్టిన నటీమణి.
ప్రస్తుతం దక్షిణాది నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మోహాన్ లాల్ సంగతి చూస్తే.. తన పద్దెనిమిదేళ్ల వయసులో.. 1978లో తెరంగేట్రం చేశారు. నాలుగు దశకాలకు పైగా తన సినీ ప్రయాణంలో 350 సినిమాల్లో నటించారు. మరీ ముఖ్యంగా మలయాళంలో మోస్ట్ కమర్షియల్ హిట్స్ గల నటుల్లో మోహన్ లాల్ కూడా ఒకరు. అప్పట్లోనే ఆయనకు సూపర్ స్టార్ గా బిరుదుండేది. ఐదు జాతీయ అవార్డులు పొందారు.
వీటిలో రెండు ఉత్తమ నటుడు అవార్డులుండగా.. ఒక జ్యూరీ అవార్డు కూడా ఉంది. ఇక 9 కేరళ చలనచిత్ర అవార్డులను సైతం పొందారు మోహన్ లాల్. 26 సంవత్సరాలకే ఉత్తమ నటుడిగా నిలిచి ఈ కేటగిరీలో అతి పిన్న వయస్కుడిగానూ పేరు సాధించారు. ఇక 2011లో పద్మశ్రీ.. 2019లో పద్మభూషణ్ అవార్డు సైతం పొందారు. ఇటు నటుడిగానే కాకుండా అటు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, సింగర్, డైరెక్టర్ పలు విభాగాల్లో మలయాళ సినిమాకు సేవలందించారు మోహన్ లాల్.
తన అభిమానుల చేత లాలెట్టన్ అని ప్రేమగా పిలవబడే మోహన్ లాల్ గత కొన్ని తరాలుగా మలయాళ సినిమాపై తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. ఆయన డైలాగులు కేరళ వాసుల నోళ్లలో నానుతుంటాయంటే అతిశయోక్తి కాదు. కేవలం మలయాళ సినిమా మాత్రమే కాకుండా భారతీయ దిగ్గజ నటుల్లోనూ మోహన్ లాల్ కి ఒక గుర్తింపు ఉంది. అలాంటి మోహన్ లాల్ ప్రస్తుతం దక్షిణాది నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వారిలో చోటు దక్కించుకున్నారు. ఎనీ హౌ కంగ్రాట్స్ మోహన్ లాల్. వియ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటోంది యావత్ దక్షిణాది సినీ అభిమాన లోకం!!!