మోడీ చతురత ముందు కేసీఆర్ వ్యూహాలన్నీ తుస్సు..!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచీ, ప్రదాని మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మూడు రోజులు భాగ్యనగరంలో బస చేస్తారని ఖరారైన క్షణం నుంచీ కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలను, ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోడీ ప్రసంగాన్నీ కూడా బీజేపీ వర్సెస్ తెరాసగా మార్చేందుకు శతథా ప్రయత్నించారు. ప్లెక్సీల వార్ నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే.. మోడీ హైదరాబాద్ వచ్చే రోజే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఆహ్వానించి రాజకీయ వేడి రగిల్చే ప్రయత్నం చేశారు.

యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపడం సంగతి అటుంచితే.. ఆయనను హైదరాబాద్ ఆహ్వానించి.. ఆ సందర్భాన్ని మోడీపై విమర్శల వర్షం కురిపించేందుకు అనువుగా వాడుకున్నారు. అంతే కాకుండా.. ఆ మరుసటి రోజు విజయ సంకల్ప్ సభలో మోడీ ప్రసంగం ఎజెండాను కూడా తానే నిర్ణయించేశారా అనేలా కేసీఆర్ యశ్వంత్ తో సమావేశంలో ప్రసంగించారు. ఇన్ని చేసినా ఆయన వ్యూహాలు పలించలేదు. కేసీఆర్ ను మించిన చతురతను మోడీ ప్రదర్శించారు. మోడీ ఏం ప్రసంగించాలో చెప్పేశానని సంబరపడిన కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్ సభలో మోడీ ప్రసంగం తరువాత డిఫెన్స్ లో పడ్డారు.

తన సవాళ్లుకు మోడీ జవాబిచ్చుకునే పరిస్థితి కల్పించానని సంబరపడిన కేసీఆర్ ఇప్పుడు మోడీ ప్రసంగం అనంతరం ఆయన ఆ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలపై  తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితిలో పడ్డారు. ఇంతకీ యశ్వంత్ సిన్హా కోసం కేసీఆర్ జల విహార్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్ సభలో తనపై విమర్శల వర్షం కురిపిస్తారు అంటూ జోస్యం చెప్పేశారు.

కానీ మోడీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు కాదు కదా..అసలు కేసీఆర్ ప్రస్తావనే తీసుకురాలేదు. అసలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్న విషయాన్నే గుర్తించనట్లుగా ఆయన ప్రసంగం సాగింది.  తెరాస ప్రభుత్వంపై ఒక్క విమర్శ లేదు. రాష్ట్రంలో అవినీతి పాలన అన్న మాటే లేదు. కుటుంబ పాలన గురించి అసలు మాట్లాడనే లేదు. అలా అని ఆయన రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా ఉందన్న విధంగా మాట్లాడారా అంటే అదీ లేదు. కేంద్రం నుంచి ఇసుమంతైనా సాయం అందడం లేదంటూ ఊదరగొట్టేస్తున్న తెరాస ప్రభుత్వం విమర్శలన్నీ అవాస్తవాలని ప్రజలకు అర్ధమయ్యేలా రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయాన్నీ,  తెలంగాణ ప్రజలకు అందుతున్న కేంద్ర పథకాల గురించి  వివరించారు.

తెలంగాణకు కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని చెప్పారు. భవిష్యత్ లో  తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తథ్యం అని నొక్కి వక్కాణించారు. మోదీ ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావన లేకపోవడం, అదే సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదంటూ చేస్తున్న తెరాస సర్కార్ ప్రచారమంతా అబద్ధమని తేల్చేసేలా మోడీ ప్రసంగం సాగడం తెరాస శ్రేణులను డిఫెన్స్ లో పడేసింది. సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం సాయం, హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కేంద్రం నిధులు అంటూ ఆయన చేసిన ప్రసంగంతో ఇప్పుడు తెరాస సర్కారే మోడీ ప్రసంగంలోని అంశాలకు స్పందించాల్సిన పరిస్థితిలో పడింది. అదే సమయంలో దేశ్ కీ నేతా అంటూ కేసీఆర్ వందల కోట్ల రూపాయలతో చేసుకున్న ప్రచారం అంతా బూడిదలో పోసిన పన్నీరు చందం అయిపోయింది. దేశ్ కీ నేతాగా కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణకీ నేతాగా కూడా మోడీ గుర్తించడం లేదని తన ప్రసంగంతో మోడీ తేల్చేశారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా   పోటీగా పోస్టర్లు.. ఫ్లెక్సీలతో సొంత ప్రచారం,   బీజేపీ నేతల్ని పార్టీలో చేర్చుకోవడం వంటి రెచ్చగొట్టే వ్యూహాలను అమలు చేసినా  మోడీ వాటిని వేటినీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. మోడీ నోట తనపై విమర్శల వర్షం కురిస్తే అది తనకు దేశ వ్యాప్త ప్రచారంగా ఉపకరిస్తుందని ఆశించిన కేసీఆర్ కు ఆశాభంగం కలిగించేలా మోడీ ప్రసంగం ఉంది.

అన్నిటికీ మించి తెలంగాణ గడ్డపై ముఖ్యమంత్రి పేరును కూడా ప్రస్తావించకుండా మోడీ చేసిన ప్రసంగం.. వచ్చే ఎన్నికలలో తెరాస అసలు పోటీలోనే ఉండదన్న సందేశాన్ని బీజేపీ శ్రేణులకు ఇచ్చినట్లు పరిశీలకులు వివ్లేషిస్తున్నారు. మోదీ కేసీఆర్ ను పట్టించుకోకుండా, ఆయనపై విమర్శలు చేయకుండా చేసిన ప్రసంగంతో తెరా శ్రేణులే నిరాశకు గురయ్యాయని చెప్పాలి. కేసీఆర్ పై మోడీ విమర్శలు గుప్పిస్తే.. దేశవ్యాప్తంగా మోడీకి దీటైన నేత కేసీఆరే అన్న ఫోకస్ వస్తుందని తెరాస నేతలు ఆశించారు.  అయితే అసలు కేసీఆర్ ను గుర్తించని విధంగా మోడీ ప్రసంగం సాగడంతో కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలు అన్నీ ఫ్లాప్ అయ్యాయన్న వ్యాఖ్యలు తెరాస శ్రేణుల నుంచే వినవస్తున్నాయి.