మోదీ ఫిదా.. బిలియ‌న్ మార్క్ టీకాలు.. స‌త్తా చాటిన టీమిండియా...

ఇండియా వ‌ల్ల కాద‌న్నారు. 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే 8-9 ఏళ్లు ప‌డుతుంద‌న్నారు. భార‌త్‌కు అంత సామ‌ర్థ్యం లేద‌న్నారు. ఎగ‌తాళి చేసిన నోళ్లన్నీ ఇప్పుడు మూత‌ప‌డ్డాయి. అదే నోటితో శ‌భాష్ ఇండియా అంటూ భుజం త‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌లో అనిత‌ర సాధ్య‌మైన శ‌త‌కోటి ప్ర‌యాణాన్ని మ‌న దేశం సునాయాసంగా సాధించింది. కేవలం తొమ్మిదంటే 9 నెలల్లోనే దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసి అరుదైన ఘ‌న‌త గడించింది. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్ జనవరి 16న కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల డోసుల పంపిణీ చేశారు. ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని ప్ర‌ధాని మోదీ అభివర్ణించారు. టీకా పంపిణీలో 100 కోట్ల మార్క్‌ను దాటిన సందర్భంగా ప్రధాని మోదీ ‘టీమిండియా - సవాళ్లకు లక్ష్యంతో సమాధానం’ అనే టైటిల్‌తో ఓ హిందీ పత్రికకు ప్ర‌త్యేక‌ ఆర్టిక‌ల్ రాశారు. ఇంత‌కీ మెదీ ఏమ‌న్నారంటే..... 

ఆందోళన నుంచి భరోసా వరకు చేరుకున్న ఈ ప్రయాణంతో దేశం మరింత బలమైందని మోదీ అన్నారు. టీకాలపై ఎన్ని అపోహలు సృష్టించినా, గందరగోళ పరిస్థితులు ఎదురైనా.. దేశ ప్రజల విశ్వాసంతోనే ఈ విజయం సాధించగలిగామన్నారు. ‘‘ఇది నాది అని ప్రతిఒక్కరూ అనుకున్నప్పుడు.. ఏదీ అసాధ్యం కాదు. దేశ ప్రజలందరికీ టీకాలు అందించాలన్న లక్ష్యంతో మన ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రమించారు. కొండలు ఎక్కి.. నదులు దాటారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించారు. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, యువత కలిసికట్టుగా పనిచేశారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో టీకాపై సంకోచాలు కాస్త తక్కువే ఎదురయ్యాయి’’ అని మోదీ చెప్పారు.

‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.   

మ‌రోవైపు.. ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతా ప్రొఫైల్ పిక్ మార్చారు. దేశం 100 కోట్ల కరోనా టీకా డోసుల్ని పంపిణీ చేసి, కీలక మైలురాయి దాటిన వేళ.. ఆ ఘనతను ప్రతిబింబించే ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.