కేసీఆర్ పై మోడీ ఫైర్.. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అంటూ వ్యాఖ్య

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన బేగంపేట విమానాశ్రయం వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. కుటుంబ పాలనలో తెలంగాణ విలవిలలాడుతోందని అన్నారు.

పౌరుషం, పట్టుదల తెలంగాణ ప్రజల సొంతమని చెప్పిన మోడీ.. తెలంగాణ పోరాటం ఒక కుటుంబం కోసం జరగలేదని, అయితే తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలంగాణ ఒకే ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిపోయిందనీ, దారుణమైన దోపిడీకి గురౌతోందని ఆరోపించారు. కుటుంబ పాలనలో అభివృద్ధి ఎలా కుంటుపడుతుందో, దోపిడీ ఎలా ఉంటుందో తెలంగాణ ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తోందన్నారు. పేదల కష్టాలు, రైతుల కడగండ్లు పట్టని ఆ కుటుంబం తెలంగాణను దోచుకోవడమే పనిగా పెట్టుకుందని మోడీ విమర్శించారు.

గత కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు ఆరోపణలతో చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ప్రధాని హోదాలో మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్బంగా ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలకకుండా మొహం చాటేస్తున్న సంగతి విదితమే.

ఇంతకు ముందు ముచ్చింతల్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడూ సీఎం కేసీఆర్ మోడీ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఐఎస్ బీ ద్వి దశాబ్ది ఉత్సవాలకు వచ్చినప్పుడూ కేసీఆర్ కర్నాటక పర్యటనకు వెళ్లిపోయారు. సీఎం ఉద్దేశ పూర్వకంగానే మోడీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడీ కేసీఆర్ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.