కేసీఆర్ ముందస్తు వ్యూహాలకు మోడీ ముకుతాడు!

రాజకీయ దురంధరుడిగా, ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహాలతో దూసుకుపోయే నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి గుర్తింపు ఉంది. నిత్యం రాజకీయ జిత్తులు, రణతంత్రపు ఎత్తులతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉండే కేసీఆర్ కు ఇటీవలి కాలంలో అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వ్యూహాలు వికటిస్తున్నాయి.

ఎత్తులు పారడం లేదు. తాడనుకున్నది కూడా పామై బుస కొడుతోంది. ఏ ముహూర్తంలో అయితే జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించారో అప్పటి నుంచీ ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాను ఒకటి తలిస్తే మరొటి జరుగుతోంది.  ఆయన ముందస్తు వ్యూహాలకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తున్నది. తెరాసకు మొదటి నుంచీ కూడా ముందస్తు ఎన్నికలు కలిసి వచ్చాయి. ఇప్పటి వరకూ కలిసి వస్తూనే ఉన్నాయి. 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పూర్తిగా ఐదేళ్లూ అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండో సారి అధికార పగ్గాలను అందుకున్నారు. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

2023 వరకూ అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ఆరు నెలలు ముందుగానే ముందస్తుకు వెళ్లి రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఆయన అనుకున్న విధంగా చేయాలంటే  సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో అసెంబ్లీని రద్దు చేయాలి. అలా జరిగితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.   కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలు అచ్చొచ్చాయన్న సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన గురించి బాగా తెలిసిన వారు కేసీఆర్ ముందస్తు యోచనలోనే ఉన్నారని ఎలాంటి సందేహం లేకుండా చెప్పేస్తారు. ఇప్పుడు ఆయన అడుగులు కూడా ముందస్తు వైపే ఉన్నాయని పరిశీలకులు సైతం అంటున్నారు. అయితే ఆయన ముందస్తు వ్యూహాలకు కేంద్రం ముకు తాడు వేసే  యోచనలో ఉంది. కేసీఆర్ కనుక ముందస్తు ఎన్నికలకు వెళితే.. కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర విభజన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇప్పటికే కేంద్రం ఆ దిశగా సంకేతాలు కూడా ఇచ్చింది. అదెలాగంటే..గత ఎనిమిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ,  తెలంగాణ రాష్ట్రాలు   అసెంబ్లీ సీట్లను పెంచాలని కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ  నియోజకవర్గాల సంఖ్యను 153 పెంచే ప్రక్రియను కేంద్రం ఆరంభించింది. ఇప్పటికే నియోజకవర్గాల సంఖ్య పెంపునకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరింది.

రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా  నివేదిక అందితే.. వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ  విషయంపై తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత వరకూ స్పందన లేదు. అది వేరే సంగతి.. కానీ   తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభనజపై గత ఏడాది ఆగస్టులో లోక్ సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం 2031 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని సమాధానమిచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకర్గాల పునర్విభజనపై వస్తున్న సమాచారంలో నిజమెంత అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

ఇక్కడే కేంద్రం తన వ్యూహ చతురతను ప్రదర్శించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వేళ ముందస్తు ఎన్నికలకే సై అంటూ అసెంబ్లీని రద్దు చేస్తే.. అప్పుడు కేంద్రం తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తుంది. ఆఘమేఘాల మీద ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదం పొందుతుంది. అప్పుడు నిర్ణీత గడువు కంటే ఆరు నెలల ముందే తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తుంది. ఎందుకంటే అప్పటికే కేసీఆర్ అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కనుక.    ఇప్పటికే కేంద్రం ఆ దిశగా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారా? ఆ ధైర్యం చేస్తారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.