ఏపీ రాజకీయాలలో మోడీ, బాబు భేటీ ప్రకంపనలు.. వైసీపీలో వణుకు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశానికి హాజరైన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడితో మోడీ ప్రత్యేకంగా ముచ్చటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయిపోయింది. మోడీ స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి ఆప్యాయంగా పలక రించడమే కాకుండా ఆయనను కొంచం పక్కకు తీసుకువెళ్లి విడిగా కొద్ది సేపు ముచ్చటించడంతో ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలంటూ పెద్ద ఎత్తున చర్చకు తెర లేచిన సంగతి తెలిసిందే.

ఆ మరుసటి రోజు ప్రధాని మోడీ ఏపీ సీఎం జగన్ తో లంచ్ చేసినా ఆ విషయానికి మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.  రోజులు గడిచినా కూడా మోడీ, చంద్రబాబు ఆత్మీయ సమావేశమే రాజకీయంగా ప్రాధాన్యతలలో నిలిచింది. అదే సమయంలో జగన్ పార్టీ కూడా బాబుతో మోడీ సమావేశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. వారి భేటీ ప్రాధాన్యతను తగ్గించడానికి పడరాని పాట్లు పడటం వైకాపాలో ఆ భేటీ వణుకు పుట్టించిందనడానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అందుకు ఉదాహరణగా సోమవారం (ఆగస్టు 8)న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు, మోడీ ప్రత్యేక సమావేశం గురించి ప్రస్తావించి విమర్శలు చేయడం కూడా ఏపీలో విస్తృత చర్చకు దారి తీసింది. రెండు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ముచ్చటించుకుంటే వైసీపీకి వణుకెందుకన్న ప్రశ్న సామాజిక మాధ్యమంలో తెగ హల్ చల్ చేస్తున్నది. నాలుగేళ్లకు పైగా ఎడమొఖం పెడమొఖం అన్న రీతిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీల మధ్య ఇటీవల ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతోందన్న అంచనాల నడుమ..వాటికి బలం చేకూరేలా మోడీ, చంద్రబాబు కొద్ది సేపే అయినా ముచ్చటించుకోవడం సహజంగానే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

కానీ వైసీపీ తెలుగుదేశం, బీజేపీల మధ్య ఆ పాటి దగ్గరతనం ఏర్పడటం కూడా సహించలేకపోతోందనడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మోడీ చంద్రబాబు ల తాజా భేటి పై విమర్శలు గుప్పించడమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విమర్శలతో సరిపెట్టకుండా ఈ భేటీ ముఖ్య ఉద్దేశం ఏమిటో కూడా సజ్జల చెప్పేయడం కూడా తెలుగుదేశం, బీజేపీలు దగ్గర కావడం ఎంతగా బయపెడుతోందనడానికి నిదర్శనమని అంటున్నారు. సజ్జల అభిప్రాయం ప్రకారం బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల కంటే కూడా తెలంగాణ రాజకీయాలపై ప్రస్తుతం ఎక్కువ ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ని గద్దె దింపి బిజెపి పార్టీని అధికారంలోకి ఎక్కించడానికి తమ వంతు సహాయాన్ని తాము చేస్తామని చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో బిజెపి కి మద్దతు పలికాడని, మొత్తానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి 2024 లో ఏపీ లో పోటీ చేయడానికి ప్రాతిపదికను చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారని సజ్జల చెప్పారు.

 ఎవరూ ప్రశ్నించకుండానే మోడీ, చంద్రబాబుల బేటీ ఉద్దేశాన్ని, భేటీలో వారి మధ్య జరిగిన సంభాషణను తాను పక్కనుండి విన్నట్లుగా సజ్జల మీడియా సమావేశంలో చెప్పేశారు. అదే సమయంలో తన మాటలకు తానే తన భుజాలు తడుముకుని వారిరువురి మధ్యా సమావేశం వైసీపీని ఏం భయపెట్టడం లేదన్న వివరణ కూడా ఇచ్చేశారు.  గతంలో వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం, ఇప్పుడు మోడీ స్వయంగా చంద్రబాబుకు దగ్గర కావడానికి ఒక అడుగు ముందుకు వేయడం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ సమీకరణాలు కొత్త రూపు దాల్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు చంద్రబాబు పేరు ఎత్తితేనే ఒంటికాలి తో లేచే సోము వీర్రాజు సైతం తన బాణీ మార్చి చంద్రబాబు విజినరీ అంటూ తాజాగా పొగడ్తలు గుప్పించడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న రోజుల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు.