కరోనా కావాలంటే మా ఇంటికి రండి.. ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ ఆఫ‌ర్‌..

గ్రామ‌స్తులారా.. మీరు న‌న్ను చాలా మిస్ అవుతున్న‌ట్టు ఉంది.. క‌రోనా వ‌చ్చినా ప‌ర్లేదు అనుకుంటే.. త‌న‌ను క‌ల‌వ‌డానికి ఇంటికి రావాలంటూ.. వైసీపీ ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి ఇంట్రెస్టింగ్ ఆఫ‌ర్ ఇచ్చారు. అంత‌కుముందు ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు పోస్ట‌ర్లు వేయ‌డం.. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో.. ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి ఇలాంటి ఆఫ‌ర్ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే.....

"ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతి గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలపగలరు. ఇట్లు.. గుంజేపల్లి గ్రామ ప్రజలు, శింగనమల నియోజకవర్గం" అంటూ పోస్టర్లు వేశారు. వైసీపీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి తమ గోడు వినిపించుకోకపోవడంతో ఇలా పోస్టర్ వేశామని గుంజేప‌ల్లి గ్రామస్థులు చెప్పారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ కావ‌డంతో.. పోస్ట‌ర్ స్ట్రాట‌జీ బాగానే వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుంది.. వెంట‌నే ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి మీడియా ముందు ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. తాను క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం వివ‌రించాల్సి వ‌చ్చింది.

తాను రెండు రోజులు కనిపించకపోతేనే తన నియోజకవర్గంలోని గుంజేపల్లి ప్రజలు తనను మిస్ అవుతున్నట్లు ఉన్నారని సెటైర్లు వేశారు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. ఈ నెల 16న తన భర్త సాంబశివారెడ్డికి కొవిడ్‌ సోకిందని.. తామంతా క్వారంటైన్‌లో ఉన్నామని వివరణ ఇచ్చారు. కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే తనను కలవడానికి ఇంటికి రావాలని గుంజేపల్లి గ్రామస్థులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి. తాను కనిపించడం లేదంటూ వైరల్ చేస్తున్న పోస్టర్ వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలియదని, వారి ఉద్దేశం ఏంటో అంతుపట్టడం లేదన్నారు.

ఇక‌, వైసీపీ ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి ఇలా వివాదాల్లో నిల‌వ‌డం ఇదే తొలిసారి కాదు. ఇటీవ‌ల, ఆమె బావ కుమారుడి ప్రవర్తన కాంట్ర‌వ‌ర్సీగా మారింది. ఆమె భర్త సాంబశివారెడ్డి అన్న కుమారుడైన ఎర్రిస్వామి రెడ్డి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని.. పెత్త‌నం చెలాయించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడిలా.. ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ పోస్ట‌ర్లు.. ప‌ద్మావ‌తి సెటైర్ల‌తో మ‌రింత ర‌చ్చ రాజుకుంది.