విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్
posted on Sep 23, 2025 5:12PM

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ఆలోచనే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ కోసం రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ప్యాకేజీతో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, కర్మాగారం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రయత్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినా కూడా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. వాస్తవాలు తెలియకుండా విమర్శించడం ప్రతిపక్షానికి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అనేక పెద్ద పరిశ్రమలు వచ్చినట్లు గుర్తుచేస్తూ, అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ స్థాపనతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. కియా రాకముందు అక్కడ తలసరి ఆదాయం రూ.70 వేల కంటే తక్కువగా ఉండగా, పరిశ్రమతో పాటు అనుబంధ యూనిట్లు రావడంతో ఉపాధి అవకాశాలు పెరిగి తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇలాంటి పెట్టుబడులు అత్యంత కీలకమని లోకేశ్ స్పష్టం చేశారు.