TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టూరిస్ట్ డెస్టినేషన్ గా మీర్ ఆలం చెరువు.!

Published on: Fri Aug 28, 2026 2:18PM

హైదరాబాద లోని మిర్ ఆలం చెరువుకు సరికొత్త రూపునిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పాతబస్తీ ప్రాంతంలోని ఈ  జలాశయాన్ని నీటి వనరుగానే కాకుండా, కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాదించే  పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు   చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను గురువారం (ఆగస్టు 27)  ఆకస్మికంగా తనిఖీ చేసి, సమీక్షించారు.

మహానగరం  పర్యాటక శోభను విస్తరించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో మిర్ ఆలం ట్యాంక్ పునరుద్ధరణ ఒకటి. చెరువు సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను  పరిశీలించిన ముఖ్యమంత్రి,  అధికారులను పనుల పురోగతిపై ఆరాతీశారు.  ఈ సందర్భంగా నిర్దేశిత కాలంలో  నిర్మాణాలు  పూర్తి చేయాలని   ఆదేశాలు జారీ చేశారు.

ఈ   అభివృద్ధి కార్యక్రమాలు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో   సాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక వినోద వసతుల కల్పనే ధ్యేయంగా మూడు  అంశాలపై దృష్టి సారించారు. జలాశయ పునరుజ్జీవనం, చుట్టుపక్కల ప్రాంతాలు, వాటిలోని   ఐలాండ్ల బ్యూటిఫికేషన్,  చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల డీపీఆర్ తుది దశకు వచ్చింది.   

ఇక యువతను ఆకట్టుకునేలా  వాటర్ స్పోర్ట్స్ , సాహస క్రీడలకు  ప్రాధాన్యత ఇవ్వాలనీ, అలాగే   పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు లోబడి బోటింగ్, ఇతర అడ్వంచరస్ కార్యకలాపాలను ప్రారంభించేలా డిజైన్లు సిద్ధం చేయాలని రేవంత్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.    చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్లను ప్రకృతి సిద్ధమైన విశ్రాంతి వేదికలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

కాగా  మిర్ ఆలం ట్యాంక్‌ను పక్కనే ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కుతో అనుసంధానించడం ద్వారా.. జూ పార్కును సందర్శించడానికి వచ్చే వేలాది మంది పర్యాటకులు అదే ప్రయాణంలో మిర్ ఆలం చెరువు అందాలను, వాటర్ స్పోర్ట్స్‌ను ఆస్వాదించేలా ఒకే ప్యాకేజీ తరహా అనుభూతిని అందించనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఉండటం వల్ల విదేశీ పర్యాటకులను సైతం ఈ ప్రాంతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులు వేగంగా సాగుతున్నాయి 

Meer alam as Tourist destination,  CM Revanth Reddy, Meer Alam Tank Development, Hyderabad Tourism, Iconic Suspension Bridge, Telugu One