సాగ‌ర్‌పై అద్భుత‌ వంతెన‌.. త్వ‌ర‌లోనే మాస్కో త‌ర‌హా మెరుపులు..

ఈ ఫోటో చూస్తుంటే.. ఆహా.. అద్బుతం అనిపించ‌ట్లేదూ.. మ‌నం కూడా ఓసారి ఆ వంతెన పైకెక్కి.. ఆ ప్రకృతి అందాల‌ను ఆస్వాదిస్తే బాగుండు అనిపిస్తోందిగా.. కానీ, ఈ ఫోటో రష్యా రాజ‌ధాని మాస్కోది. ఆగండాగండి.. అంత‌లోనే డిస‌ప్పాయింట్ అవ్వాల్సిందేమీ లేదు.. సేమ్ టూ సేమ్ అలాంటిదే కాకున్నా.. దాదాపు ఇలాంటి ఆకాశ వంతెన త్వ‌ర‌లోనే మ‌న హైద‌రాబాద్‌లో అందుబాటులోకి రానుంది.. న‌గ‌రం మ‌ధ్య‌లో ఉన్న హుస్సేన్ సాగ‌ర్ తీరంలో మాస్కో త‌ర‌హా వేలాడే బ్రిడ్జి నిర్మించ‌నున్నారు. అంతా అనుకున్న‌ట్టే జ‌రిగితే.. ఈ ఏడాది చివరికల్లా నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్ ద‌గ్గ‌ర ఇలాంటి వంతెన‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్టు హెచ్‌ఎండీఏ కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ట్విటర్‌ ద్వారా వెల్ల‌డించారు. 

మాస్కోలోని జర్యాడే పార్క్‌లో మోస్క్వా నదిపై ఈ తేలియాడే వంతెన ఉంది. నది లోపలకి యూ ఆకారంలో దాదాపు 70 మీటర్ల పొడవుతో నిర్మించారు. వంతెన కింద 13 మీటర్ల దూరం నుంచి మోస్వ్యా నది ప్రవహిస్తుంది. ఈ వంతెనపై ఉంటే.. నదిపైన ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వంతెన‌పై ప‌ర్యాట‌కులు న‌డిచే భాగంలో.. పారదర్శకమైన గాజును ఏర్పాటు చేయ‌డంతో.. బ్రిడ్జిపై నిల్చొని కిందకు చూస్తే.. నది అలలు, అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. నది లోపల ఎలాంటి స్తంభాలు లేకుండా రోప్‌వే ద్వారా దీనిని నిర్మించారు. 

మాస్కో బ్రిడ్జి కాన్సెప్ట్‌తో.. మ‌న ప‌రిస్థితులు, అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు మార్పు చేర్పుల‌తో హుస్సేన్ సాగ‌ర్ తీరంలో నెక్లెస్ రోడ్డు ద‌గ్గ‌ర ఇలాంటి వంతెన నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు రెడీ అయ్యాయి. ఇప్పటికే ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్డుకు సంద‌ర్శ‌కుల తాకిడి ఎక్కువే. త్వరలో ట్యాంక్‌బండ్ ద‌గ్గ‌ర‌ నైట్‌ బజార్ కూడా రానుంది. ఇక‌, మాస్కో మాదిరే తేలియాడే వంతెన కూడా వ‌స్తే.. హుస్సేన్ సాగ‌ర్ తీరం మ‌రింత‌ టూరిస్ట్ డెస్టినేష‌న్‌గా మార‌నుంది. అయితే, వ‌చ్చిన‌వారు ఆ హుస్సేన్ సాగ‌ర్ నీటి దుర్వాస‌న‌ను మాత్రం భ‌రించాల్సిందే. 

ఇక‌, గతంలో ట్యాంక్‌బండ్‌పై లండన్‌ ఐ ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసినా ఎందుకోగానీ ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఇప్పుడు మాస్కో బ్రిడ్జి త‌ర‌హా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు. మ‌రి, ఇదైనా...!?