బిరియానీ లేదని ఏకంగా పెళ్లే ఆపేశారు!

పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతుండటం మనం వింటూనే ఉంటాం. అలాంటి సంఘటనలకు కారణాలు వదువు, వరుడు కుటుంబాల మధ్య తగాదాలో, పెళ్లి విందులో తాగి గొడవ పడటమో...లాంటి కారణాలు ఉంటాయి. కానీ తమిళనాడులో మాత్రం ఒక పెళ్లి కేవలం విందులో వడ్డించడానికి బిరియానీ తయారు కాలేదని ఆగిపోయింది. అంతే కాదు వధువు, వరుడు కుటుంబాల వారు చర్చించుకుని మరీ పెళ్లి ఈ ముహూర్తానికి ఆపేసి.. కాదు కాదు వాయిదా వేసి మరో రోజు పెట్టుకుందామని నిర్ణయానికి వచ్చారు. అంతే పెళ్లికి వచ్చిన బంధువులందరికీ విషయం చెప్పి క్షమాపణలు చెప్పి మరీ వాయిదా వేశారు. మరో ముహూర్తానికి ఆహ్వానిస్తామనీ, అప్పుడు తప్పని సరిగా హాజరై వధూవరులు ఆశీర్వదించి తాము ఇచ్చే విందారగించాలని కోరారు.

ఇంతకీ అసలు సంగతేమిటంటే.. పెళ్లి ఘనంగా చేయడంతో పాటు విందును అంతకంటే ఘనంగా ఏర్పాటు చేయాలని పెళ్లికుమారుడు, పెళ్లి కూతురు తరఫు వారు ముందే నిర్ణయించుకున్నారట. విందులో మంసాహారం, బిరియానీ మస్ట్ అని ముందుగా నే మెనూ సిద్ధం చేసుకున్నారు. తీరా పెళ్లి సమయం వచ్చే సరికి వారు ఆర్డర్ మేరకు వచ్చిన మాంసం కుళ్లిపోయిందని గుర్తించారు.

అయినా అనుమాన నివృత్తి కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందిస్తే వారు వచ్చి అది కుళ్లిపోయిన మాసం అని నిర్ధారించారు. దీంతో పెళ్లి వాయిదా వేసి మరో ముహూర్తానికి పెళ్లి జరిపించి వధూవరులకు పసందైన విందు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.