మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు చాతీ నొప్పి... హాస్పిటల్ లో అడ్మిట్ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చాతీ నొప్పిగా ఉండడంతో పరీక్షల కోసం గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు ఎమ్మెల్యే ఆర్కే. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆర్కే ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుపై మంగళగిరిలో విజయం సాధించారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి. 

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి శనివారం నియోజకవర్గంలో పర్యటించారు. మంగళగిరి-తాడేపల్లి పరిధిలోని పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నరసింహస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. సాయంత్రం పెదకాకానిలోని తన నివాసానికి బయలుదేరారు. ఈ క్రమంలో చాతీలో నొప్పి రావడంతో చూపించుకునేందుకు నగరంలోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.