అర్థరాత్రి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది : సీఎం మమతా
posted on Oct 12, 2025 5:59PM

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టళ్లలో ఉండే అమ్మయిలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిదని ఆమె సూచించారు. మెడికల్ స్టూడెంట్ గ్యాంగ్‌రేప్‌పై ఘటనపై మమతా బెనర్జీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హాస్టల్ నుంచి అర్థరాత్రి 12 :30 గంటలకు అమ్మాయి ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రిపూట బయటకు రానివ్వకూడదని అన్నారు.
అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మణిపుర్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో ఇలాంటివి జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని మమతా అన్నారు. ఒడిశాకు చెందిన యువతి పశ్చిమ బెంగాల్‌లో అత్యాచారానికి గురైంది. జలేశ్వర్‌కు చెందిన ఆమె దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
శుక్రవారం రాత్రి భోజనం కోసం స్నేహితుడితో కలిసి కాలేజీ క్యాంపస్ బయటకు వెళ్లిన విద్యార్థినిని కొందరు యువకులు వెంబడించారు. బైక్‌లపై వచ్చిన వారు అసభ్యంగా ప్రవర్తించి, ఆమె స్నేహితుడిని బెదిరించి పంపించివేశారు. అనంతరం విద్యార్థినిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి మొబైల్ ఫోన్‌ను కూడా దొంగిలించారు.
తరువాత స్నేహితుడు మరికొందరిని తీసుకెళ్లి అక్కడికి చేరుకోగా, విద్యార్థిని తీవ్ర గాయాలతో కిందపడి ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనలో షేక్ రియాజుద్దీన్, అపు బౌరి, ఫిర్దోస్ షేక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని పశ్చిమ బెంగాల్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. బాధిత విద్యార్థినికి అన్ని విధాల సహాయం అందిస్తామని కాలేజీ యాజమాన్యం ప్రకటించింది.