చంద్రబాబుపై మల్లారెడ్డి పొగడ్తల వర్షం.. ఏంటి విషయం?
posted on Sep 9, 2025 2:58PM
.webp)
పాలమ్మిన, పూలమ్మిన వంటి డైలాగులతో హాస్యం పండించడమే కాకుండా, ఏదో ఒక వివాదంలో నిత్యం వార్తలలో కనిపించే బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై పొగడ్తల వర్షం కురిపించారు. సందర్భం, సమయంతో పని లేకుండా నిత్యం తనదైన ప్రత్యేక వాగ్ధాటిలో అందరి దృష్టినీ ఆకర్షించే మల్లారెడ్డి ఇప్పుడు చంద్రబాబుపై అంత ఘనం పొగడ్తలు కురిపించారన్న దానిపై ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి తన జన్మదినం సందర్భంగా మంగళవారం (సెప్టెంబర్ 9) తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పాలనను ప్రశంసించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత నుంచి మల్లారెడ్డి పేరుకే బీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాదు.. మీడియాకూ, రాజకీయ ప్రసంగాలకూ దూరంగా ఉంటూ వస్తున్నారు. దానికి భిన్నంగా తిరుమల వేదికగా ఆయన మళ్లీ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులపై తనదైన శైలిలో గళం విప్పారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై కూడా ప్రశంసలు కురిపించేశారు.
చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. చంద్రబాబు అద్భుత పాలనా దక్షుడని కితాబిచ్చేయడమే కాకుండా.. కేంద్రంలో నరేంద్రమోడీ పాలనలో దేశంలో లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయన్నారు. సరే అసలింతకీ మల్లారెడ్డి చంద్రబాబు, మోడీలపై ఇంత హఠాత్తుగా ప్రశంసల వర్షం కురిపించడం వెనుక కారణమేంటన్న చర్చ ఇప్పుడు తెలుగురాష్ట్రాలలో జోరుగా సాగుతోంది.