దేశ రాజకీయాలలో కొత్త ఒరవడికి నాంది పలికిన మహానాడు

మహానాడు.. తెలుగుదేశం జరుపుకునే పండుగ. ఈ పండుగను తెలుగుదేవం పార్టీ 1983 నుంచి క్రమం తప్పకుండా జరుపుకుంటోంది. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా మహానాడు పండుగను జరుపుకోలేదు కానీ, పార్టీ ఆవిర్భావం నుంచి క్రమం తప్పకుండా మహానాడుకు తెలుగుదేశం పార్టీ ఒక పండుగలా, ఒక ఉత్సవంగా నిర్వహించుకుంటూ వస్తోంది.

అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తెలుగు తమ్ముళ్లు అదే ఉత్సాహంతో, అదే చైతన్యంతో మహానాడుకుహాజరౌతూనే ఉన్నారు. అయితే మహానాడు తొలి సారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత 1982 మే 26, 27, 28 తేదీలలో నిర్వహించుకుంది. ఆ మహానాడు దేశ రాజకీయాలలో ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది. సామాఖ్య స్ఫూర్తికి కొత్త నిర్వచనం చెప్పింది. ఒక ప్రాంతీయ పార్టీ జరుపుకుంటున్న పార్టీ కార్యక్రమానికి జాతీయ స్థాయి నేతలందరూ హాజరు కావడం అప్పటి వరకూ ఎన్నడూ జరగలేదు.

ఇది దేశ రాజకీయాలలోనే ఒక కొత్త ఒరవడి. సామాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవలసిన అవసరాన్ని ఎన్టీఆర్ ఆనాడే గుర్తించారు. అందుకు అవసరమైన ప్రయత్నాలూ ప్రారంభించారు. ఆయన ఒక్క మాటను గౌరవించి వాజ్ పేయి, అద్వానీ, ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు , రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, మేనకాగాంధీ వంటి నేతలు మహానాడుకు అతిథులుగా హాజరయ్యారు. అంటే దాదాపు కాంగ్రెసేతర పార్టీల అగ్ర నేతలందరూ నాడు మహానాడుకు హాజరయ్యారు.

అప్పటికే రాష్ట్రాల హక్కుల పరిరక్షణ విషయంలో  కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారం ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను పెడుతున్న ఇబ్బందులపై ఎన్టీఆర్ జాతీయ స్థాయి నాయకులతో విస్తృతంగా చర్చలు జరిపేందుకు తెలుగుదేశం తొలి మహానాడు వేదిక అయ్యింది. ఆ చర్చలే తరువాత ధర్డ్ ఫ్రంట్ ఏర్పడేందుకు దోహదం అయ్యాయి. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు బీజం వేసింది. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ప్రస్తుత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలో పోషించిన పాత్ర ఇప్పుడు చరిత్ర.

 జాతీయ రాజకీయాలకు అప్పట్లో చంద్రబాబు కేంద్ర బిందువుగా ఉండేవారు. పార్టీల మధ్య సమన్వయం కుదర్చడంలో ఆయన చూపిన చొరవ, పరిణితిని అప్పట్లో  దేశం మొత్తం శ్లాఘించింది. తెలుగుదేశం మహానాడుకు అంతటి ఘన చరిత్ర ఉంది.  టీడీపీ మహానాడుకు వచ్చిన వారందరికి బస ఏర్పాటు చేయడం, భోజన సదుపాయాలు సమకూర్చడం వరకూ అన్నీ పార్టీయే చేస్తుంది. ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఈ ఒరవడికి శ్రీకారం చుడితే.. చంద్రబాబు దానిని కొనసాగిస్తున్నారు.