సింహమా.. గ్రామ సింహమా?.. యూట్యూబ్ నిర్వాహకుడి అరెస్టుపై లోకేష్ ఫైర్

 సామాజిక మాధ్యమంలో పోస్టులకు అరెస్టులు వద్దని సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పింది. అయితే సుప్రీం ఆదేశాలు, తీర్పులు ఏపీలో అమలౌతున్న దాఖలాలు కనిపించడం లేదు. అడ్డగోలుగా, అడ్డదారులు వెతికి మరీ సుప్రీం ఆదేశాల ఉల్లంఘన జరుగుతోంది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ విషయంలోనూ అదే జరిగింది.

తాజాగా తెలుగుదేశం కార్యకర్త, యూట్యూబ్ నిర్వాహకుడు, సోషల్ మీడియాలో చురుకుగాఉండే  వెంకటేశ్ అరెస్టు ఆ కోవలోకే వస్తుంది. వెంకటేష్ అరెస్టుపై  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిఫైర్ అయ్యారు. అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకి, తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేయడమిటని మండి పడ్డారు.

సీఎం జగన్ కు సామాజిక మాధ్యమమంటే వణుకు అని విమర్శించారు. యూట్యూబ్ చానెల్ ను చూసి భయపడే జగన్ సింహమెలా అవుతారని ప్రశ్నించారు. నిజానికి ఆయన గ్రామ సింహం కూడా కాదని ఎద్దేవా చేశారు. అమరావతి మండలం ధరణి కోటకు చెందిన వెంకటేష్ జగన్ పై, వైసీపీపై విమర్శనాత్మక కథనాలను యూట్యూబ్ లో ఉంచిన కారణంగానే అరెస్టు చేశారని లోకేష్ ఆరోపించారు.

జగన్ ప్రాపకం కోసమే పోలీసులు ఆయనను అరెస్టు చేశారని, గోడదూకిన పోలీసులు తమ ముఖాలు కనపడకూడదని లైట్లు పగల గొట్టారనీ, వారి ముఖాలన్నీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయనీ అన్నారు. ఇలా ముఖ్యమంత్రి ప్రాపకంకోసం చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న వారంతా ముందు ముందు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ అన్నారు.