ప్రజారోగ్యంపై మామా అల్లుళ్ల దృష్టి! మంగళగిరి, హిందూపురంలో ఆరోగ్య రథాలు

ఒక వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల కోసం పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేస్తూ రాకెట్ వేగంతో దూసుకు పోతుంటే.. మరో వైపు పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రి స్పీడును అందుకుంటూ.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పరుగులు తీస్తున్నారు. ఆయనకు పార్టీ బలోపేతంతో పాటు మంగళగిరిలో తన విజయానికి బాటలు వేసుకోవడమన్న అదనపు బాధ్యత కూడా ఉంది.

ఎక్కడైతే పరాజయం ఎదురైందో అక్కడే తన విజయాన్ని ఘనంగా చాటాలన్న పట్టుదలతో లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే  మంగళగిరిలో అన్నా క్యాంటిన్లు ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికీ శుభమస్తు  అనే నినాదంతో సంజీవనీ ఆరోగ్య రథాన్ని   ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లకు ప్రజల నుంచి వచ్చిన స్పందనకు ఏ మాత్రం తీసిపోని విధంగా  ఆరోగ్య రథానికి సైతం ప్రజాస్పందన వెల్లువెత్తుతుండటంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తున్నాయి.  ఆరోగ్య రథానికి వచ్చిన స్పందన ఏ స్థాయిలో ఉందంటే.. లోకేష్ స్ఫూర్తితో హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆరోగ్య రథాన్ని తన నియోజకవర్గంలో ప్రారంభించారు. త్వరలో హిందూపురం నియోజకవర్గంలో మరిన్ని ఆరోగ్య రథాలను తీసుకురావాలని బాలకృష్ణ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆరోగ్య రథాన్ని తన నియోజకవర్గంలో కూడా ప్రారింభించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్ణయించారట. ఆ క్రమంలో ఇప్పటికే ఒక ఆరోగ్య రథం.. హిందూపురం చేరుకుని.. ప్రజలకు సేవలందిస్తోందని తెలుస్తోంది. మరి కొన్ని వాహనాలు.. మరి కొద్ది రోజుల్లో హిందూపురం చేరుకుంటాయని తెలుస్తోంది. ముచ్చటగా మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు కోసం బాలయ్య  ప్రయత్నాలు ప్రారంభించారు.

ఆ క్రమంలో మరిన్ని పథకాలు తీసుకు వచ్చేందుకు ఈ మామా అల్లుళ్లు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకర్గానికి  మొత్తం మీద మూడు లేదా నాలుగు ఆరోగ్య రథాలను కేటాయించాలని వీరు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తన అల్లుడు, తెలుగుదేశం జాతీయ కార్యదర్వి నారా లోకేష్ ప్రజా సేవా దృక్ఫథం తనను ముగ్ధుడ్ని చేసిందని బాలయ్య అంటున్నారు. హిందూపురంలో తాను ప్రారంభించిన ఆరోగ్య రథం ప్రతీ రోజు ఓ గ్రామానికి వెళ్తి.. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి.. మందులిస్తారు. అయితే ఆరోగ్య పరంగా పెద్ద సమస్య ఉంటే.. పెద్ద ఆసుపత్రులకు వెళ్లాలంటూ వారిని రిఫర్ చేసి.. తక్కువ ఖర్చుతో అక్కడ వైద్యం అందేలా చర్యలు సైతం తీసుకొంటారు. పల్లెటూళ్లులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగ్గా పని చేయడం లేదు. దీంతో టీడీపీ తీసుకు వచ్చిన ఆరోగ్య రథాలకు ప్రజల్లో భారీగా డిమాండ్ ఏర్పడుతోంది.

ప్రజల ఆకలిని తీర్చడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు  మామా అల్లుళ్లు నడుం కట్టారు.    గత ప్రభుత్వ హాయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సేవలు అందేవనీ, కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వ వైద్యం సరిగా అందడం లేదనీ ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బాలయ్య,   లోకేశ్ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి ఆరోగ్య రథాలను జనంలోకి పంపించడం పట్ల జనంలో హర్షం వ్యక్తం అవుతోంది.  

మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో తాను మంగళగిరి నుంచి బరిలో దిగనున్నట్లు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు.  అలాగే హిందూపురం నుంచే బాలయ్య మరోమారు బరిలో దిగనున్నారు. దీంతో మామా అల్లుళ్లిద్దరూ తమ తమ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూనే.. ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేసే బృహత్తర బాధ్యతను తలకెత్తుకున్నారు.