ఇష్టం లేనివారితో కలిసి జీవించాల్సి వస్తే!

 

ప్రపంచంలో మనకి ఇష్టంలేని వారు చాలామంది ఉంటారు. వారిలో కొందరిని మనం తప్పించుకుని తిరగలేని పరిస్థితి. అది ఆఫీసులో అధికారి కావచ్చు, పక్కింటి సుబ్బారావు కావచ్చు. ఇలా మనసుకి నచ్చనివారితో కలిసి రోజుని గడపాలంటే కష్టమే! కానీ వారితో ఉన్నంత సేపూ ముళ్ల మీద కూర్చున్నట్లు ఇబ్బందిగా గడపడం వల్ల... మన మనసు చెడిపోతుంది, బంధమూ చిక్కుముడిగా మారిపోతుంది. అందుకే ఈ చిట్కాలు పాటించి చూడండి!

 

పని గురించి :- ఏ పని మీదైతే మీరిద్దరూ కలిసి ఉన్నారో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యక్తిగత స్థాయి నుంచి కాస్త ఎదిగి మాట్లాడండి. అధికారితో అయితే సంస్థ లక్ష్యాల గురించి, పక్కింటి సుబ్బారావుతో అయితే స్ట్రీట్ లైట్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫలితం మీకే కనిపిస్తుంది.

 

అహాన్ని బుజ్జగించండి :- వ్యక్తిగత అహాలే ఇద్దరు వ్యక్తులను దూరం చేస్తాయి. అవసరం అనుకున్నప్పుడు మన అహాన్ని తగ్గించుకుని అవతలి వ్యక్తికి కాస్త విలువ ఇచ్చినట్లు ప్రవర్తించడంలో తప్పు లేదు. ‘ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు!’, ‘మీ సలహా ఏమిటి!’... లాంటి మాటలతో వారికి విలువ ఇచ్చనట్లు అవుతుంది. వారు సాధించిన చిన్న చిన్న విజయాలను పొగిడితే అసలు తిరుగే ఉండదు.

 

మంచి మీద దృష్టి పెట్టండి :- రావణాసురుడు అంతటి వాడిలో సైతం ఏదో మంచి లక్షణం ఉంటుంది. ఇక సాధారణ మనుషులలో మంచి లక్షణాలకు కొదవేముంటుంది? వారు చిన్నప్పుడు కష్టపడి పైకి వచ్చి ఉండవచ్చు, కంప్యూటర్ మీద మంచి పట్టు ఉండవచ్చు, ఏదీ కాకపోతే కనీసం ఆహారపు అలవాట్లన్నా మంచిగా ఉండవచ్చు. ఇలా ఎదుటి మనిషిలో ఉండే మంచి లక్షణాల మీద దృష్టి పెడితే అతని మీద కోపం ఉపశమిస్తుంది.

 

పట్టించుకోవద్దు :- మనకి ఇష్టమైనవారి గురించి కాసేపు మాత్రమే ఆలోచిస్తాం. కానీ ద్వేషించే వ్యక్తుల గురించి నిరంతరం ఆలోచిస్తుంటాం. దాంతో మన సమయమూ, లక్ష్యమూ వృధా అయిపోతుంటాయి. అతని దృక్పథంలో లోపం ఉంది కనుక, వారినే జపిస్తూ ఉంటే మనం కూడా వారిలా మారిపోవడం ఖాయం. కాబట్టి అతనికంటే విలువైన మీ జీవితానికీ, వ్యక్తిత్వానికీ, లక్ష్యాలకీ ప్రధాన్యతని ఇచ్చే ప్రయత్నం చేయండి.

 

రెచ్చగొట్టవద్దు :- అహంకారం, ఆత్మన్యూనత వంటి లోపాలు ఉన్నవారిని రెచ్చగొడితే వారి ప్రవర్తన చాలా అనూహ్యంగా ఉంటుంది. అందుకని వివాదంతోనో, వాదనతోనో వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు. ‘నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతీ’ అని పెద్దలు ఊరికే అనలేదు కదా!

 

ఎందుకని ఇష్టం లేదు? :- చాలా సందర్భాలలో మనం ఎలాంటి బలమైన కారణం లేకుండానే అవతలి వ్యక్తి మీద అయిష్టత ఏర్పరుచుకుంటాం. కానీ కాసేపు మన విచక్షణకు పదునుపెట్టి, అతన్ని అంతగా ద్వేషించడానికి కారణం ఏమిటి అన్న ఆలోచన మొదలైతే... చాలామంది మీద ద్వేషం నిష్కారణం అని తేలిపోతుంది.

 

చివరగా మరో చిన్న చిట్కా! మీరు ఎవరితో అయితే ఇష్టం లేకుండా గడపాల్సి వస్తోందో.... అంతకంటే దుర్మార్గులూ, నీచులూ... ఈ లోకంలో చాలామంది ఉన్నారని గ్రహిచండి. అలాంటివారు మీ జీవితంలో లేనందుకు సంతోషించండి. అప్పుడు మీ ముందు ఉన్నవారంతా పరమ సాధుజీవులుగా కనిపించక మానరు.

- నిర్జర.