హత్య కేసులో జీవిత ఖైదీకి బెస్ట్ టీచర్ అవార్డు.. అసలెంజరిగిందో తెలుసా.!
Published on: Sat Aug 29, 2026 10:01AM

ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఖైదీ.. బెస్ట్ టీచర్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? జైల్లో సత్ప్రవర్తనతో తోటి ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పడం వల్ల ఆ పురస్కారం లభించిందనుకుంటున్నారా? కాదు కాదు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి పెరోల్ పై బయటకువచ్చి పరారైపోయాడు. నాలుగు దశాబ్దాలుగా పోలీసుల కన్నుగప్పి అజ్జాతంలో ఉంటూనే.. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి.. ఏకంగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్నారు. నమ్మశక్యంగా లేకున్నా ఇది పచ్చి నిజం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సందెల వీరన్న అనే వ్యక్తి ఒక హత్య కేసులో కోర్టు జీవిత ఖైది విధించింది. దీంతో అధికారులు జైలుకు తరలించారు. ఆరు నెలలలో అంటే 1983 డిసెంబర్ లో వీరన్న నిబంధనల ప్రకారం 30 రోజుల పరోల్‌పై జైలు నుండి బయటకు వచ్చాడు.
పరోల్ పై బయటకు వచ్చిన తర్వాత, చట్టపరమైన అవకాశాలను వాడుకుంటూ ఆ కాలాన్ని 1984 మార్చి వరకు పొడిగించుకుంటూ వచ్చాడు. పరోల్ ఉత్తర్వుల ప్రకారం, 1984 మార్చి 18న తిరిగి సంబంధిత జైలు అధికారుల ఎదుట హాజరై లొంగిపోవాల్సి ఉంది. కానీ.. ఆ గడువు ముగిసినా వీరన్న జైలు ముఖం చూడలేదు. పరారయ్యాడు. ఆ పరారీ పర్వం ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు కొనసాగింది.
పరారైన వీరన్న, చ తన పేరు, చిరునామా, పాత పరిచయాలన్నింటినీ పక్కన పెట్టేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మరో ప్రదేశానికి వెళ్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడయ్యాడు. నిబద్ధత కలిగిన టీచర్‌గా నటిస్తూ, విద్యార్థులకు పాఠాలు చెబుతూ పేరుప్రతిష్టలు సంపాదించుకున్నాడు. విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను అతనికి బెస్ట్ టీచర్ పురస్కారం కూడా లభించింది.
ఒక వైపు ఖైదీల రికార్డుల్లో అతడు పరారీలో ఉన్న నేరస్థుడిగా కొనసాగుతుండగా, మరొక వైపు ప్రభుత్వ వ్యవస్థలో బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా జీతం పొందుతూ, అవార్డులు అందుకుంటూ సమాజంలో చెలామణి కావడం విశేషం.
ఎట్టకేలకు విషయం బయటపడి కటకటాల పాలయ్యాడు. అయితే.. నాలుగు దశాబ్దాలుగా పరారీలో ఉన్న వీరన్నకు సహకరించిన వ్యక్తులు ఎవరు, చట్టం కళ్లుగప్పి.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు అన్న విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. దశాబ్దాల పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో ఎలా కొలువుదీరాడనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.
{Life Prisioner Best Teacher Awardww, Sandela Veeranna, Warangal murder case, absconding, Parole, Best Teacher Award, crime news, Telugu One}


