వివాహేతర సంబంధంతో విషాదం… రెండు కుటుంబాల విచ్చిన్నం
posted on Oct 11, 2025 7:02PM

అక్రమ సంబంధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రజలలో మార్పు రావడం లేదు. అక్రమ సంబంధాల వలన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతు ప్రాణాల మీదికి వస్తున్నప్పటికీ తమ తీరును మార్చుకోలేకపోతున్నారు. తాజాగా అక్రమ సంబంధంతో ప్రియుడు ప్రియురాలు కూడా ఒకరి మీద మోజుతో మరొకరు కుటుంబ సంబంధాలను తెంచుకొని ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి లో గ్రామానికి చెందిన ధనుంజయ గౌడ్ (27) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తన కంటే పెద్దది అయిన శశికళతో ప్రేమ లో పడ్డారు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ వేరే వేరే వారితో పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగించారు. అయితే పెళ్లి అయిన తరువాత కూడా వారి మధ్య వివాహేతరబంధం కొనసాగడం, ఇద్దరు గ్రామాన్ని వదిలి కొద్ది రోజులు వెల్లిపోవడంతో ధనుంజయ గౌడ్ భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఆ తరువాత కూడా వీరిద్దరి మధ్య వివాహేతరబంధం కొనసాగడమే కాకుండా ప్రియురాలు శశికళ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడుతో గ్రామాన్ని వదిలి ఎమ్మిగనూరు కు వచ్చేసింది. ఎమ్మిగనూరు లో మెడికల్ షాప్ పెట్టుకున్న ధనుంజయ గౌడ్ ప్రియురాలిని ఓ లేడీస్ హాస్టల్ లో చేర్చి తమ బందాన్ని కొనసాగించాడు. అయితే హాస్టల్ లో ఉండలేక పోతున్నానని, పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాలని ప్రియురాలు నిత్యం ఒత్తిడి పెంచింది. ప్రియుడు కాలయాపన చేస్తుండటం తో ఆదివారం ప్రియురాలు తాను ఉంటున్న హాస్టల్ లో మెడకు ఉరిని బిగించుకొని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ ఫోటో ను ధనుంజయ గౌడ్ కు పంపింది.
ఆమె చనిపోతే తనపై కేసు నమోదై జైలుకు వెళ్ళాల్సి వస్తుందని భయపడ్డ ధనుంజయ గౌడ్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామంలోని పొలం లోకి వెళ్లి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం పక్కన ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలించారు. అయితే చికిత్స పొందుతూ ధనుంజయ గౌడ్ అదే రోజు రాత్రి మృతి చెందాడు. శశికళ నిత్యం వేధింపులు చేస్తుండడంతోనే తమ కుమారుడు మరణించాడని ధనుంజయ గౌడ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ప్రియుడు ధనుంజయ గౌడ్ మరణం తట్టుకోలేక తాను కూడా ప్రియుడి దగ్గరికి వెళ్లాలని ధనుంజయ్ మరణించిన మరుసటిరోజే ప్రియురాలు శశికళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన చికిత్స కొరకు, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున శశికళ మృతి చెందింది. వివాహేతర సంబంధం మత్తులో గువ్వల దొడ్డి గ్రామానికి చెందిన ఇరువురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.