కేటీఆర్ దూకుడు.. నేతల్లో వణుకు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? తెరాస అధ్యక్షుడు ఎవరు? గత కొద్ది రోజులగా ఇక్కడా అక్కడ వినిపిస్తున్న ఈ  ప్రశ్న, ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా  తెరాస వర్గాల్లోనే వినిపించడం విశేషం. అవును, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైన వరకు దూరంగా ఉంటున్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లో గానీ, ఇటు ప్రభుత్వ వ్యవహార్ల్లో అయినా చుట్టపు చూపుగా పాల్గొంటున్నారే తప్ప మునుపటిలా మనసు పెట్టడం లేదని తెరాస నాయకులు, కార్యకర్తలు కొంత బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందులా క్రియాశీలంగా వ్యవహరించడం లేదని, పరిపాలనను పెద్దగా పట్టించుకోవడం లేదని అధికార వర్గాల్లోనూ చాల కాలంగా చర్చ జరుగుతోంది. సీనియర్ అధికారులు కూడా ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చేయవలసి వస్తోందని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎక్కువకాలం ఫార్మ్ హౌస్ కే పరిమితం కావడం, రోజులు, వారాల తరబడి అధికారులు ఎవరికి అందుబాటులో  లేకపోవడంతో కీలక నిర్ణయాలను కూడా వాయిదా వేసుకోవలసి వస్తోందని మాట అధికార వర్గాల్లో వినవస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాజకీయాలు మునుపటిలా రుచించడం లేదనే మాట  అంతటా వినిపిస్తోంది. 

మరోవంక, తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జోరు పెంచారు.ఇటు ప్రభుత్వ వ్యవహరాలలో అటు, పార్టీ కార్యక్రమాల్లో అయన సర్వం తానే అన్నట్లుగా దూసుకు పోతున్నారు. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలలో కేసీఆర్ ను పక్కన పెట్టి తానే స్వయంగా చక్రంతిప్పుతున్నారని,అంతరంగిక వర్గాల సమాచారంగా తెలుస్తోందని అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి పేరున వెలువడుతున్న నిర్ణయాలు అన్నీ ఆయన స్వీయ  నిర్ణయాలు కాకపోవచ్చని, కేటీఆర్ నిర్ణయాలు కేసీఆర్ పేరున వెలువడుతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  

ఇందుకు సంబంధించి, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు,నిర్ణయాలు కేటీఆర్  తీసుకుంటారు, కేసీఆర్, మమ అంటారు అంటూ మర్మగర్భంగా వ్యంగ బాణాలు సంధించారు. అలాగే,  ఒక విధంగా చూస్తే, కర్తగా కేసీఆర్ ను పెట్టి కార్యం కేటీఆర్ కానిస్తున్నట్లుగా ఉందని పార్టీలోని మరి  కొందరు నాయకులు అంటున్నారు. 

ప్రతిపక్షాల రాష్ట్రపతి  అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపే విషయంలోనూ, కేసీఆర్  కు తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదని, అయితే, కేటీఆర్ పట్టు పట్టుపట్టి, స్వయంగా సిన్హా నామినేషన్ కార్యక్రమాలో పాల్గొన్నారని అంటున్నారు. నిజానికి, అదే నిర్ణయం స్వయంగా కేసీఆర్ తీసుకుని ఉంటే స్వయంగా ఆయనే ఢిల్లీ వెళ్లి సిన్హా నామినేషన్ కార్యక్రంలో పాల్గొనే వారని, అయన వెళ్ళ లేదంటే అది అయన తీసుకున్న నిర్ణయం కాదని, అంటున్నారు. నిజానికి, బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన మహిల ద్రౌపతి ముర్ము పేరును ప్రకటించిన నేపధ్యంలో, కేసీఆర్ తటస్థ వైఖరి తీసుకోవాలని అనుకున్నారని, పోలింగ్ కు ముందు వరకు మౌనంగా ఉండి చివర్లో ‘ఆత్మ ప్రభోదం’ మేరకు ఓటు వేయాలని, నిర్ణయాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలకు వదిలేయాలని, తద్వారా దళితులు, గిరిజనులకు తెరాస వ్యతిరేకం కాదనే సందేశం ఇవ్వాలని కేసేఅర్ ఆలోచన చేశారు. అందుకే, యశ్వంత్ సిన్హా పర్యటన సందర్భంగానూ, ఆయన చెప్పవలసింది అంతా చెప్పి చివరకు, మనసులో ఉన్న. ఆత్మ ప్రభోదం మంత్రాన్నే బయట పెట్టారని, తెరాస నాయకుల సమాచారంగా ఉందని అంటున్నారు. 

ఇదలా ఉంటే, మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తమ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ కూల్చివేస్తుందనే భయం మొదలైందని అంటున్నారు. అందుకే యశ్వంత్ సిన్హా ప్రచార సభలో కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని కూల్చివేస్తే, తాము కేంద్ర సర్కార్ ను పడగొడతామని  హెచ్చరించారని  అంటున్నారు.అంటే, మహారాష్ట్ర పరిణామాలు తెలంగాణాలోనూ సంభవించే ప్రమాదం లేక పోలేదని, కేసేఆర్, అనుకుంటున్నారా? అనుమానిస్తున్నారా?  పార్టీలో చీలికకు అవకాశం ఉందనే అనుమానం ఏదైనా వుందా? అందుకే ఈ హెచ్చరిక చేశారా? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. 

నిజానికి, కేటీఆర్  దూకుడుకు కళ్ళెం వేసేందుకు అవసరం అయితే తిరుగుబాటు చేసేందుకు కూడా ఒకవర్గం సిద్ధంగా ఉందని అంటున్నారు. మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో,  కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వలన రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ  కూడా నష్టపోవలసి ఉంటుందని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు భయపడుతున్నారు.

అవునన్నా కాదన్నా, మనకు ఇష్టం ఉన్న లేకున్నా బీజేపీ జాతీయ పార్టీ,, కేంద్రంలో. సగానికి పైగా రాష్ట్రాల్లో ,అధికారంలో ఉన్న పార్టీ, అన్నిటినీ మించి బీజేపీ  ప్రస్తుత నాయకత్వం, మోడీ, షా జోడీ ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంలో పాత రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టి ముందుకు దూసుకు పోతోంది. ఆ ఇద్దరి కన్ను పడితే, ఇక అంతే సంగతులు ... అనే భయం పార్టీలో కొందరు ముఖ్య నేతలు వ్యక్త పరుస్తున్నారు.

తెలంగాణపై మోడీ, షా కన్ను పడింది అనే విషయంలో సందేహం లేదు.. ఇప్పటికే ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు మొదలయ్యాయి. అంతేకాదు, ఓ వంక  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపధ్యంగా బీజేపీ, తెరాసల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న సమయంలోనే  లోక్ సభలో తెరాస పక్ష నేత నామ నాగేశ్వర రావుకు చెందిన మధుకాన్ కంపెనీఆస్తులు రూ.92 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసింది. కేటీఆర్ బీజేపీ జాతీయ నాయకుల్ని ఇలాగే  రెచ్చ గోడితే అటు నుంచి  ఇలాంటి దాడులు, జప్తులు  ఇంకా చాలా జరగుతాయని, దీనికి తెరాస ఎమ్మెల్యేలలో ఉన్న అసంతృప్తి తోడైతే, తెరాసను చీల్చడం పెద్ద పని కాకపోవచ్చని అంటునారు. అందుకే కేటీఆర్ దూకుడు తగ్గించుకోవడం మంచిందని, లేదంటే  అందుకు మూల్యం చెల్లించక తప్పదని, అంటున్నారు.