గెలుపోటములు సహజమేనట.. హుజురాబాద్ లో కేటీఆర్ హ్యాండ్సప్? 

ముఖ్యమంత్రి కేసీఆర్  మాటల్లో జోష్ తగ్గింది. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు ఆయన మాటల్లో వినిపించిన బేలతనం.. మోత్కుపల్లి నరసింహులు పార్టీలో చేరిన సమయంలో  ఆయన చేసిన ప్రసంగంలో కనిపించింది.  ఆయన ప్రతి మాటలో ప్రతి పలుకులో, ప్రతి వంపులో  ఏదో భయం తొంగి చూసింది. ముఖ్యంగా హుజూరాబాద్ ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో చివరకు  హుజూరాబాద్ లో మనమే గెలుస్తున్నాం  అని చెప్పే సందర్భంలోనూ ముఖ్యమంత్రి మాటల్లో ఓటమి భయం పస్పుటంగా కనిపించిందని ఎవరో కాదు సొంత పార్టీ నాయకులే అంటున్నారు. 

ఇతర విషయాల సంగతి ఎలా ఉన్నా  హుజూరాబాద్ విషయంలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చారు.. డిసైడైపోయారు అనే మాట పార్టీ నాయకుల మాటల్లోనే వినవస్తోంది. రేవంత్ రెడ్డి పిచ్చాపాటికి జవాబుగా, మీడియాతో ముచ్చట్లు పెట్టిన తె మంత్రి కేటీఅర్ చాలా చాలా విషయాలు చెప్పారు. గొప్పలు చెప్పుకున్నారు. మా పథకాలను కేంద్రం అనుకరించి అమలు చేస్తోందన్నారు.హుజురాబాద్ లో వంద శాతం విజయం సాధిస్తున్నాం అన్నారు.. నాగార్జున సాగర్ లో జానారెడ్డినే ఓడించాం.. రాజేందర్ అంతకన్నా  పెద్ద లీడరా అంటూ ఎగ సెక్కాలాడారు. అయితే దుబ్బాకలో ఎందుకు ఓడిపోయామో మాత్రం  చెప్పలేదనుకోండి. అయితే  చాంతాడంత రాగం తీసి అదేదో పాటపడినట్లుగా  చివరాఖరులో, హుజూరాబాద్’లో ఓడిపొతే ఓడి పోతాం’ అని అర్థం వచ్చేలా’ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమే అంటూ తత్వబోధనకు దిగారు కేటీఆర్.  

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అనేది ఇపుడు కొత్తగా కేటీఆర్ కనుగొన్న సత్యం కాదు. అందరికీ తెలిసిన, అందరి అనుభవంలో ఉన్న వాస్తవమే. అయినా, ఇప్పుడు ఆయన ఆ విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకున్నారంటే హుజూరాబాద్ ఓటమికి కేటీఆర్ సిద్దమైపోయారని అనుకోవచ్చును అంటున్నారు.  నిజానికి కేటీఆర్ హుజూరాబాద్ లో తెరాస ఓటమినే కోరుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు పార్టీలోని  కొందరు నాయకులు వ్యక్తపరుస్తున్నారు. సుమారు నాలుగు నెలలకు పైగా హుజూరాబాద్ చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నా కేటీఆర్ ఇంతవరకు అటుకేసి కన్నెత్తి చూడలేదు. అంతే కాదు హుజూరాబాద్ ఉపఎన్నికకు పార్టీ అనవసర ప్రాధాన్యత ఇస్తోందని, పరోక్షంగా హరీష్ రావును దెప్పిపొడిచారు.  అనేక ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఒకటి, అంటూ తమ చేతికి రేపటి ఓటమి తడి అంటకుండా ముందు నుంచి జాగ్రత్త పడుతూ వస్తున్నారని అంటున్నారు,

ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే మాటన్నారు. హుజురాబాద్ ఖచ్చితంగా చిన్న ఎన్నికే అన్నారు ..అదే సమయంలో, రాష్ట్ర ప్రజల ఆలోచనకు హుజురాబాద్ ఉప ఎన్నిక కచ్చితంగా ప్రతిబింబమే అన్నారు. అంటే, గెలిస్తే, తమ ఖాతాలో వేసుకుని, ఓడి పోతే సర్వం తానై హుజూరాబాద్ పులి మీద స్వారీ చేస్తున్న హరీష్ రావును బోనులో నిలిపేందుకు వ్యూహాత్మకంగా చిట్ చాట్ చేశారు అంటున్నారు. హుజూరాబాద్ స్టార్ క్యాంపైనర్ జాబితాలో, రెండో స్థానంలో ఉన్న కేటీఆర్, తానూ హుజూరాబాద్ ప్రచారానికి వెళ్ళడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వెళ్ళేది కూడా అనుమానమే అన్నట్లుగా సీఎం ప్రచారం కూడా ఇంకా ఖరారు కాలేదని కేటీఆర్ చెప్పారు. అయితే, తాను గతంలో గెలిచినా నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారానికి కానీ, ఓడిపోయిన  దుబ్బాక కు కూడా వెళ్ళలేదని చెప్పు కొచ్చారు. అలాగే, రేవంత్ ఈటల తదితరులు తెరాసపై కుట్రకు తెరలేపారు.. ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈటెలకు ఓటయ్యాలని లేఖ రాయడం ఏమిటీ అంటూ ఓటమీ తధ్యం అనే ధోరణిలో మాట్లాడారు.

మొత్తానికి సోమవారం కేసీఆర్ , మంగళవారం కేసీఆర్ పలికిన పలుకులను పక్క పక్కన పెట్టి చూస్తే.. హుజూరాబాద్ వషయంలో తెరాస నాయక ద్వయం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుందని పరిశీలకులు భావిస్తున్నారు.