ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? :కేటీఆర్

 

తాము కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినప్పటి ఫొటోలను షేర్ చేసి ప్రశ్నించారు. ప్రియమైన రాహుల్‌గాంధీ, ఫొటోల్లోని కాంగ్రెస్ కండువాలను గుర్తు పట్టగలరా? ఢిల్లీలో మీతో కలిసిన ఈ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మీరు గుర్తించగలరా? ఇప్పుడు కారు గుర్తుపై  గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఈ ఎమ్మెల్యేలు అందరూ తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని చెబుతున్నారు. 

ఇది మీరు అంగీకరిస్తున్నారా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేంటి..? అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీని నిలదీశారు. కాగా, ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు కంటే.. ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని ట్విట్టర్‌లో రాహుల్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కండువా పార్టీ కప్పుతున్నప్పుడు.. తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కండువా కప్పుతున్నారని పేర్కొన్నారు. మేము పార్టీ మారలేదని. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని ఎమ్మెల్యేలు తెలిపారు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని పేర్కొన్నారు. 

3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో వీరి నుంచి వివరణ కోరుతూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలివ్వగా.. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలివ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu