రాజకీయ సన్యాసం కాదు.. విరామం.. త్వరలో మరో పార్టీలోకి..కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో కలిసి కోమటిరెడ్డి బ్రదర్స్ గా గుర్తింపు పొందారు. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికకు ముందు వరకూ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే వరకూ తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న బలమైన నేతలలో ఒకరు. నల్గొండ జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడిగా పార్టీ అధిష్ఠానం వద్ద మంచి గుర్తింపు పొందిన వ్యక్తి.  అయితే తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి కమలం తీర్థం పుచ్చుకుని మునుగోడు ఉప ఎన్నికకు కారణం అయిన తరువాత నుంచీ పార్టీలోనే కాదు..రాజకీయాలలో కూడా ఒకింత వెనుకబడ్డారనే చెప్పాలి.

మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఆయన చేసిన రాజకీయ విన్యాసాలు, సొంత పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో ఆయన పార్టీలో ఉన్నా లేకున్నట్లే తయారైంది. మునుగోడు ఫలితం తరువాత ఆయన బొత్తిగా నల్లపూసగా మారిపోయారు. ఎక్కడా కనిపించడం లేదు.. ఆయన వాణి ఎక్కడా వినిపించడం లేదు. తెలంగాణలో సంచలనం సృష్టించిన షర్మిల అరెస్టు అనంతరం ఇన్ని రోజుల తరువాత ఆయనా సంఘటనను ఖండించారు. దీనిని బట్టే ఆయన పొలిటికల్ గా యాక్టివ్ గా లేరన్నది స్పష్టమౌతోంది. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా గురువారం తాను రాజకీయ సన్యాసం తీసుకోలేదనీ.. విరామం మాత్రమే తీసుకున్నానన్నారు. త్వరలో ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించుకుంటానని చెప్పారు. అంటే ఇప్పటి వరకూ ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారనుకుంటున్న వారికి ఆ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పారు.

అయితే పార్టీకి రాజీనామా చేశారా లేదా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడం ద్వారా తాను కూడా తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బాటలోనే నడవబోతున్నానన్న సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండి కూడా మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనలేదు. ఆ ఎన్నిక సమయంలో పార్టీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేశారు. పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన వివరణ ఇచ్చినా దానిపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతే కాకుండా పార్టీ సీనియర్ నాయకుడు..మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగినప్పుడు కనీసం ఆ ఛాయలకు కూడా వెళ్లలేదు.

అప్పటి నుంచీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి, పార్టీ కార్యక్రమాలకూ దూరంగానే ఉంటున్నారు. పీసీసీ చీఫ్ పదవిని ఆశించిన ఆయన అది దక్కకపోవడంతో పార్టీకి దూరం అయ్యారరు. ఇప్పుడు తాజాగా చేసిన ప్రకటనతో ఆయన అడుగులు కమలం వైపు అడుగులు వేస్తున్నారన్నది దాదాపు ఖరారైనట్లే.