వీళ్లు వాళ్లేనా?

అక్రమాస్తుల కేసులో  ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత  హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇందు కోసం ఆయన బేంగళూరు నుంచి బుధవారం (నవంబర్ 18) తాడేపల్లిలోని తన ప్యాలెస్ కు చేరుకున్నారు. గురువారం (నవంబర్ 19)న ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సరే అదలా ఉంచితే..  బుధవారం నవంబర్ 18) తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఉండి.. గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తరువాత సైలెంటైపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిశారు.

వీరితో పాటు ఇప్పుడు పార్టీలో వాయిస్ వినిపిస్తున్న ఏకైక నాయకుడు పేర్ని నాని కూడా ఉన్నారు. ఈ నలుగురూ ఒకే ఫ్రేములో కనిపించడం చాలా కాలం తరువాత ఇదే తొలిసారి.  కాగా జగన్ ను కలిసిన ముగ్గురు నాయకులు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీలలో పేర్ని నానిలో భౌతికంగా పెద్ద మార్పేమీ కనిపించలేదు కానీ, వల్లభనేని వంశీ, కొడాలి నానిల అపియరెన్స్ లో మాత్రం చాలా చాలా మార్పు కనిపించింది. కొడాలి నాని బరువు తగ్గిపోయి.. మనిషి దాదాపుగా సగానికి సగం తగ్గిపోయినట్లు కనిపించారు. వల్లభనేని పరిస్థితి కూడా అలాగే ఉంది. వైసీపీ అందగాడు అంటు జగన్ గతంలో అభివర్ణించిన వల్లభనేని వంశీలో ఇప్పుడు ఆ చార్మ్ కానీ, ఉత్సాహం కానీ మచ్చుకైనా కనిపించడం లేదు.  నెరిసిపోయిన జుట్టు, గుబురుగడ్డంతో వంశీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఈ ముగ్గురూ అంటే కొడాలి, పేర్ని నాని ద్వయం, వల్లభనేని వంశీ అధికార గర్వంతో విర్రవీగుతో.. ప్రత్యర్థులపై ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిగా నోరు పారేసుకునే వారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలైతే అనుచిత భాషా ప్రావీణ్య ప్రదర్శనలో డాక్టరేట్ పొందారా అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత వారిలో ఆ దూకుడు, దురుసుతనం పూర్తిగా కనమరుగైపోయి మన్నుతిన్న పాములా అన్నట్లుగా కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu