ఏపీలో కేజీఎఫ్ త‌ర‌హా మైనింగ్‌.. ఎక్క‌డో తెలుసా? విల‌న్ ఎవ‌రంటే..

కేజీఎఫ్‌. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌. ద‌శాబ్దాల క్రితం క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన గోల్డ్ మైనింగ్‌. ఆ బేస్ లైన్‌ను తీసుకొని.. కేజీఎఫ్ మూవీతో బంప‌ర్ హిట్ కొట్టారు. అక్ర‌మ మైనింగ్‌, మైనింగ్ ఏరియాని గ‌రుడ‌ త‌న‌ కంట్రోల్‌లో పెట్టుకోవ‌డం, మైనింగ్ జ‌రుగుతున్న ప్రాంతంలోకి చీమ కూడా చొర‌బ‌డ‌కుండా చేయ‌డం.. ఇలా విల‌నిజాన్ని ఓ రేంజ్‌లో చూపిస్తారు. సేమ్ టు సేమ్ కాక‌పోయినా.. కొంచెం తేడాతో ఏపీలోనూ రెండు చోట్ల‌ కేజీఎఫ్ త‌ర‌హా అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతోంద‌నే విమ‌ర్శ‌. కేజీఎఫ్‌లో గోల్డ్‌ను కొల్ల‌గొడితే.. ఇక్క‌డ విలువైన‌ ఖ‌నిజాల‌ను త‌వ్వేస్తున్నారు. కేజీఎఫ్‌లోకి ఎవ‌రినీ రానివ్వ‌న‌ట్టే.. ఏపీలోనూ మైనింగ్ ఏరియాలో అడుగుపెడితే బీభ‌త్సం సృష్టిస్తున్నారు.

గ‌రుడ ఇలాఖాలో అడుగుపెట్టిన రాఖీలా.. కొండ‌ప‌ల్లి అడ‌వుల్లోకి వెళ్లిన దేవినేని ఉమాను విల‌న్ మ‌నుషులు చుట్టుముట్టి నానా ర‌చ్చ చేశారంటూ పోలుస్తున్నారు. కొండ‌ప‌ల్లి అనే కాదు.. విశాఖ మన్యంలోనూ కేజీఎఫ్ త‌ర‌హా అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతోంద‌ని ఆరోపిస్తున్నారు. విశాఖ మ‌న్యం, కొండ‌ప‌ల్లి అడ‌వుల ఇతివృత్తంతో కేజీఎఫ్ చాప్ట‌ర్ 3, 4.. సీక్వెల్స్ తీయొచ్చ‌ని అంటున్నారు. ఇలా కేజీఎఫ్‌కు ఏపీ మైనింగ్‌కు లింక్ పెడుతూ.. సినిమాటిక్‌గా విమ‌ర్శ‌లు చేశారు వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. మ‌రి, రాజు గారు అన్నారంటే.. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ జ‌ర‌గాల్సిందేగా. అదే అవుతోంది ఇప్పుడు. 

ఏపీలో కేజీఎఫ్ కు సినిమాకు స్టోరీలు తయారవుతున్నాయన్నారు ర‌ఘురామ‌. ''కర్ణాటకలోని కేజీఎఫ్ లో ఎవర్నీ లోపలకు రానివ్వరు. అక్కడికి వెళితే చంపేస్తారు. అక్కడ కోలార్ లో గోల్డ్ మైన్లు ఉంటే.. ఇక్కడ మైన్లు ఉన్నాయి. కేజీఎఫ్ లో హీరో ఏదో చేస్తారు. చాప్టర్ 2 కూడా వస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 3.. 4 కూడా కథ రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి'' అని అన్నారు.

చాప్టర్ 3ను మన్యం అడవుల్లో.. చాప్టర్ 4 కొండపల్లి అడవుల్లో ఉంటుందన్న ఎంపీ రఘురామ.. క్లైమాక్స్ ఎలా ఉంటుందోన‌నే ఆస‌క్తి వ్య‌క్తం చేశారు. ఏపీలో జరుగుతున్న సంఘటల్ని చూస్తే.. తనకు అలా అనిపిస్తోందన్నఆయన.. అదంతా నిజమో.. కాదో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తాను ప్రాతినిధ్యం వహించే పార్టీ దెబ్బ తినకూడదని తాను ముఖ్యమంత్రికి ఈ విన్నపాన్ని చేస్తున్నట్లుగా చెప్పారు. ఎవరైనా తప్పులు చేస్తే శిక్షించాల్సిన ప్రభుత్వం.. మరి ప్రభుత్వమే తప్పులు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు.