అర్జెంటుగా అధ్య‌క్షులు ఎందుకు? కేసీఆర్‌లో భ‌యం జొచ్చిందా?

టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 ఏండ్లు దాటింది. తెలంగాణ రాష్ట్రం సాకార‌మై ఏడేండ్లు గ‌డుస్తోంది. తెలంగాణ‌లో త‌మ‌దే తిరుగులేని పార్టీగా చెప్పుకునే కేసీఆర్‌.. స్వ‌రాష్ట్రం వ‌చ్చాక‌ ఇంత‌వ‌ర‌కూ టీఆర్ఎస్‌ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించింది లేదు. రాష్ట్ర కార్య‌వ‌ర్గ‌మే కానీ.. కాంగ్రెస్‌లో మాదిరి జిల్లాల స్థాయిలో బ‌ల‌మైన వ్య‌వ‌స్థ మాత్రం లేదు. జిల్లా అధ్య‌క్షులు అవ‌స‌ర‌మేలేద‌ని గ‌తంలో ఓ సంద‌ర్భంలో కేసీఆర్ అన్నారు కూడా. అలాంటిది.. ఇప్పుడు స‌డెన్‌గా 33 జిల్లాల‌కు టీఆర్ఎస్ అధ్య‌క్షుల‌ను నియ‌మించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అదికూడా రిప‌బ్లిక్ డే రోజున‌.. అంత సీక్రెట్‌గా ఆ లిస్ట్ రిలీజ్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌నేది మ‌రో అనుమానం.

ఓవైపు కాంగ్రెస్, బీజేపీలు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండయాత్ర చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై రంకెలేస్తున్నారు. బండి సంజ‌య్ గేరు మార్చి ఫుల్ రేజింగ్‌లో ఉన్నారు. స్టేట్ లెవెల్‌లో వీరిద్ద‌రూ కొట్లాడుతుంటే.. క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల కేడ‌ర్ దూకుడుగా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేస్తున్నాయి. అయితే, ప్ర‌తిప‌క్షాల దాడిని కాచుకోవ‌డంలో గులాబీ కేడ‌ర్ పూర్తిగా విఫ‌లం అవుతోంద‌నే చెప్పాలి. కేసీఆర్ ఒక్క‌డే ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోనో, తెలంగాణ భ‌వ‌న్‌లోనో ప్రెస్‌మీట్లు పెట్టి ఫైర్ అవుతున్నారు గానీ, జిల్లాల స్థాయిలో ఇటు ప్ర‌భుత్వం, అటు పార్టీ ప‌రంగా బ‌ల‌మైన వాయిస్ వినిపించే వారు క‌రువ‌వుతున్నారు. వ‌రిపై కేంద్రంతో యుద్ధాన్ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. తానొక్క‌డే ఫైట్ చేస్తున్నారు కానీ, ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌జ‌ల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేసేందుకు గానీ, రైతుల‌ను జ‌త‌క‌ట్టి కేంద్రం, బీజేపీపై ఎదురుదాడి చేసేందుకు గానీ, కాంగ్రెస్ విమ‌ర్శ‌ల‌కు ధీటుగా బ‌దులిచ్చేందుకు గానీ.. గులాబీ కేడ‌ర్ ముందుకు రావ‌డం లేదు. ఆ.. మాకెందుకులే.. అంతా కేసీఆరే చూసుకుంటారులే.. అనే ఉదాసీన‌త టీఆర్ఎస్ శ్రేణుల్లో క‌నిపిస్తోంది. జిల్లా స్థాయిలో ప‌టిష్ట‌మైన పార్టీ నెట్‌వ‌ర్క్ లేక‌పోవ‌డం.. ఎవ‌రికీ జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని కేసీఆర్ చాలా ఆల‌స్యంగా గుర్తించినట్టున్నారు.

మ‌రో వాద‌నా వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ త్వ‌ర‌లోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తారంటూ గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజా ప‌రిణామం అందుకు మ‌రింత బ‌లం చేకూర్చుతోంది. జిల్లా అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించి.. క్షేత్ర స్థాయిలో పార్టీని ప‌టిష్టం చేసి.. అంతా ఓకే అనుకున్నాక‌.. ప్ర‌తిప‌క్షాల‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా.. స‌డెన్‌గా ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి గ‌తంలో మాదిరి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది కేసీఆర్ వ్యూహం అని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. లాస్ట్ ట‌ర్మ్ ఎల‌క్ష‌న్స్‌లో కాస్త ఫీల్ గుడ్ ఎన్విరాన్‌మెంట్ ఉంది కాబ‌ట్టి స‌రిపోయింది. ఈసారి ప‌రిస్థితి దారుణంగా ఉంది. కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంది. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఆయ‌న‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. వ‌రి వేస్తే ఉరి అన్నందుకు రైతులు.. ఉద్యోగాలు లేనందుకు నిరుద్యోగులు.. కొత్త పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు లేక పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు.. ద‌ళిత బంధు అంద‌రికీ ఇవ్వ‌క ద‌ళితులు.. గొర్రెల పంపిణీ లేక యాద‌వులు.. ఇలా దాదాపు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే స‌మ‌యంలో.. దూకుడు మీదున్న కాంగ్రెస్‌, బీజేపీల వైపు ఆశ‌గా చూస్తున్నారు. 

స‌ర్వేల‌తో ఆ విష‌యం గుర్తించిన కేసీఆర్‌.. పార్టీ యంత్రాంగంతో ప్ర‌భుత్వ అనుకూల ప్ర‌చారం చేయించి.. ప్ర‌జావ్య‌తిరేక‌తను త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారు. ప్ర‌జ‌లు రేవంత్‌రెడ్డి వైపో, బండి సంజ‌య్ వైపో చూడ‌కుండా.. నిత్యం కాంట్ర‌వ‌ర్సీల‌తో పొలిటిక‌ల్ అటెన్ష‌న్ త‌న‌వైపున‌కే తిప్పుకుంటున్నారు. విప‌క్షాల‌కు క‌ట్ట‌డి చేసి.. ధీటుగా ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసేందుకే.. ఏడేళ్లుగా లేని జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వుల‌ను హ‌డావుడిగా ప్ర‌క‌టించార‌ని అంటున్నారు. 

తెలంగాణలోని 33 జిల్లాలకు టీఆర్ఎస్‌ అధ్యక్షులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. 19 మంది ఎమ్మెల్యేలకు.. ముగ్గురు ఎంపీలకు.. అలాగే ముగ్గురు జడ్పీ చైర్మన్లకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి. ఇందులోనూ జ‌న‌గామ‌, ఖ‌మ్మం, ములుగు లాంటి జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు, ఆశావ‌హుల‌కు షాకులు త‌ప్ప‌లేదు.