కేటీఆర్ కు కేసీఆర్ షాక్.. టీఆర్ఎస్ నేతల్లో పరేషాన్!     

అధికార తెరాస సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్, టీఎస్ఆర్టీసీ చైర్మన్’గా  నియమించారు. ఆయన వారం రోజుల క్రితం,(సెప్టెంబర్ 19) ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అది బాజీ రెడ్డి కోరుకున్న పదవికాదు. నిజానికి, నిజామాబాద్ రూర‌ల్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాజీరెడ్డి మంత్రి పదవిని ఆశించారు. గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగొచ్చిన ఆయనకు, ఒక్కసారన్నా మంత్రిగా ఓ వెలుగు వెలగాలనే కోరిక కాసింత బలంగానే ఉందని అయన సన్నిహితులు అంటారు. అంతే కాకుండా, మంత్రి వర్గ విస్తరణ పతిపాదన ఎప్పుడు తెర మీదకు వచ్చినా  నిజామాబాద్ జిల్లా నుంచి బాజిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. 

అయితే దేవుడు ఒకటి తలిస్తే, పూజారి ఇంకొకటి తలిచారు అన్నట్లుగా, బాజిరెడ్డి ఒకటి తలిస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, అదే జిల్లా నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున  ఏమ్మేల్ల్సీ కవిత వేరొకటి  తలచారు. ఈసారి, మంత్రి వర్గ విస్తరణలో తప్పక స్థానం సంపాదించాలని, గట్టి పట్టుమీదున్న ఆమె. అప్పుడు మళ్ళీ బాజిరెడ్డి ఎక్కడ అడ్డు వస్తారో, అనే ముందు చూపుతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు.కేసీఆర్ ఆశీస్సులతో బాజీరెడ్డిని బస్సెక్కించి మంత్రి పదవి రేసులోంచి పక్కుకు తప్పించారు. ఆర్టీసీ చైర్మన్’గా బాజీరెడ్డి ప్రమాణ స్వీకారానికి రవాణా మంత్రి పువ్వాడ అజయ్ రాలేదు కానీ, ఎమ్మెల్సీ కవిత వచ్చారు. రావడమే కాదు, పక్క నుండి మరీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కీలక భూమికను పోషించారు. అంతే కాకుండా ఆమె చాలా కాలం తర్వాత పబ్లిక్ లోకి వచ్చారో ఏమో ఈ కార్యక్రమంలో కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

బాజీ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ కావడం వెనక, ఇంకో కీలకమైన కటుంబ రాజకీయ కోణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకుల సమాచారం. బాజీరెడ్డి గోవర్దన్ కు ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానో, లేక ఇంకేవైనా పాత పంచాయతీలు ఉన్నాయో ఏమో కానీ, ఆయనంటే రవాణా మంత్రి పువ్వాడ అజయ్  కు పడదు. ఆయన ఆర్టీసీ చైర్మన్ కావడం ఆయనకు ఇష్టం కూడా లేదు.  సో... పువ్వాడ, మంత్రి కేటీఆర్  ద్వారా చక్రం తిప్పి బాజిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కకుండా చేసేందుకు చాలా చాలా గట్టి ప్రయత్నమే చేశారట. కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి దగ్గర తమ వాదనను చాలా బలంగా వినిపించారట. అయితే కేసీఆర్  దగ్గర కేటీఅర్ పప్పులు ఉడక లేదు. అయన, కేటీఆర్ చెప్పిందంతా విని, కవిత అడిగితే, అది ఏదైనా కాదనలేనని, మనసులోని మాట ముఖం మీదనే చెప్పారని సమాచారం. 

ఆ విధంగా కేసీఆర్ కొడకు కేటీఅర్, కూతురు కవిత మధ్య, ఇప్పుడు ఈ విషయంలో కానీ, రేపు మరో బిగ్ పోస్ట్ విషయంలో కానీ పోటీ వస్తే, అయన ఎటు మొగ్గు చూపేది చెప్పకనే చెప్పారు. కవితకే నా ఓటని కేసీఆర్ తేల్చి చెప్పారని అంటున్నారు. ఏమో రాజకీయాలలో అందులోనూ కుటుంబ రాజకీయాలలో ఏదైనా జరగవచ్చును. అందుకు కల్వకుట్ల ఫ్యామిలీ పాలిటిక్స్ మినహాయింపు కాదు .. అంటున్నారు. అందుకే అంటారు పాలిటిక్స్ లో కాని, ఫ్యామిలీ పాలిటిక్స్ లోకానీ, పైకి కనిపించేదే నిజం కాదు.. అసలు నిజం ఏమిటో సమయం వచ్చునప్పుడే బయట పడుతుందని అంటారు. మెరిసేదంతా బంగారం కాదు కనిపించేది అంతా నిజం కాదు.