‘సంచలనం’ వదలని కేసీఆర్- బెంగళూరులోనూ అదే పాత

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్వాగత సభలో కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలోనే బెంగళూరులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘సంచలనం’ అంటూ మరో మారు జాతీయ రాజకీయాలలో రాబోతున్న పెను మార్పు గురించి ప్రస్తావించారు. కేసీఆర్ చెప్పిన సంచలనం కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించేందుకు జాతీయ స్థాయిలో తన రాజకీయ అజెండాకు పెరుగుతున్న మద్దతు గురించేనని పరిశీలకులు అంటున్నారు. మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రోజే కేసీఆర్ కర్నాటక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంతకు ముందు దేశ వ్యాప్త పర్యటన అంటూ బయలు దేరి అర్ధంతరంగా వెనక్కు వచ్చేసిన కేసీఆర్  నోట అప్పట్లో ఢిల్లీలో కేజ్రీవాల్ తో భేటీ తరువాత కూడా  సంచలనం’ మాట వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే బెంగళూరులో జేడీఎస్ అగ్ర నేతలతో భేటీ తరువాత ఆయన ఆ ‘సంచలనం’ రెండు మూడు నెలలలో సంభవిస్తుందని చెప్పారు. కింద పడ్డా నాదే పై చేయి అన్న విధంగా కేసీఆర్ తన జాతీయ రాజకీయ అరంగేట్రం కోసం తొక్కని గడప లేదు, మొక్కని రాయి లేదు అన్నట్లుగా చేస్తున్న ప్రయత్నాలేవీ కలసి రాకపోయినా.. ఏదో జరగబోతోందంటూ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను చవి చూస్తోందనీ, రాష్ట్రంలో మరో సారి అధికారంలోకి రావాలంటే జాతీయ స్థాయిలో తనకు గొప్ప ఇమేజ్ ఉందని రాష్ట్ర ప్రజలలో నమ్మకం కలిగించడమొక్కటే మార్గమని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర పతి ఎన్నికల నాటికి ఎన్డీయే అభ్యర్థికి పోటీగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలకు పెద్దగా స్పందన  రాకపోవడంతో ఏకంగా ఆయన సోనియాతో భేటీకి ప్రయత్నించారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడితే బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రతిపాదించాలని భావించారు. అయితే కేసీఆర్ తో భేటీకి సోనియా తిరస్కరించారు. దీంతో దేశ వ్యాప్త పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని వెనుదిరిగిన కేసీఆర్.. మోడీ రాష్ట్ర పర్యటనలో ఆయనను అవాయిడ్ చేసే లక్ష్యంతోనే మళ్లీ కర్నాటక పర్యటనకు వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన తెలంగాణలో టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా జాతీయ అజెండా ప్రకటిస్తూ ఏం మాట్లాడారో అదే మరోసారి రిపీట్ చేశారు. మోడీ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని పాత పాటే వల్లె వేశారు. దేశాన్ని ఎందరో ప్రధానులు పాలించినా పరిస్థితుల్లో మార్పు లేదని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక ఇక్కడ మరో అంశమేమిటంటే కర్నాటకలో కేసీఆర్ పర్యటన సందర్భంగా తెరాస కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిపై కేసీఆర్ నిలువెత్తు ఫొటోలతో పాటు దేశ్ కీ నేతా కేసీఆర్ అన్న నినాదాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ హస్తిన పర్యటన సందర్భంగానూ ఇలాంటి కటౌట్లు, ఫ్పెక్సీలూ కనిపించిన సంగతి తెలిసిందే.