గవర్నర్ తో గ్యాప్ కు కారణం అదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూటే సెపరేటు. అప్పుడలా ఉన్నారు కదా.. ఇప్పుడెందుకు రూటు మార్చారూ అన్న డౌట్స్ కి ఎక్కడా జవాబు దొరకదు. అడిగే సాహసమూ ఎవరూ చేయలేరు. అదంతే. గతంలో గవర్నర్ గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ తో మాంచి ఫ్రెండ్షిప్ అనేకన్నా... సాన్నిహిత్యం లాంటి స్నేహపూర్వకమైన గురుభక్తిని ప్రదర్శించేవారు అంటే సబబుగా ఉంటుంది. నరసింహన్ సలహాలతోనే కేంద్రంతో కేసీఆర్ సఖ్యంగా మెలిగారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆయన సూచనలు, సలహాలే కేసీఆర్ పాలనకు వెన్నుదన్నుగా పనిచేశాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేంద్రం ప్రతినిధిగా వ్యవహరించిన నరసింహన్ వేరు.. ఆ తరువాత ఓ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో నరసింహన్ వ్యవహరించిన తీరు వేరు. ఆ రకమైన అవగాహన వల్ల కేసీఆర్-నరసింహన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటైంది. కానీ ఇప్పుడు గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందర రాజన్ తో కేసీఆర్ కు ఎక్కడా పొసగడం లేదని, అందువల్లే వారి మధ్య తీవ్రమైన గ్యాప్ పెరిగిందన్న విమర్శలు బలపడుతున్నాయి. అటు కేంద్రం విధానాలపై, మోడీ నియంతృత్వ పోకడలపై సై అంటే సై అంటున్న కేసీఆర్... ఈ మధ్య తమిళిసై సౌందర రాజన్ ను అస్సలు కలవడం మానేశారని, అధికారిక హోదాలో సైతం గవర్నర్ తో కలిసేందుకు ఇష్టపడటం లేదన్న గుసగుసలు బయటకు పొక్కుతున్నాయి. అందుకు దారితీసిన పరిస్థితులు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 

లేటెస్ట్ గా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేసిన వార్త బాగా వైరలైంది. నందిపేటలో అభివృద్ధి కార్యక్రమాల కోసం తన అనుచరులు, కార్యకర్తలతో వెళ్తున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అడ్డుకున్నారు. ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దసంఖ్యలో రెండువైపులా కార్యకర్తలు మోహరించడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. అర్వింద్ కారు అద్దాలు పగులగొట్టడంతో పాటు బీజేపీ కార్యకర్త మీదికి ఓ టీఆర్ఎస్ కార్యకర్త కత్తి తీసుకొని పొడవడానికి వెళ్లిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై అర్వింద్ కూడా అక్కడి నుంచే కరీంనగర్ సీపీ సత్యనారాయణకు ఫోన్ చేసి నిలదీశారు. మొన్నామధ్య కోవిడ్ కారణంతో ఇంట్లో ఉండి దీక్ష చేసిన ఎంపీ బండి సంజయ్ ని అరెస్టు చేసిన పోలీసులు ఇక్కడ గుమిగూడిన టీఆర్ఎస్ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదని, ఆ కోవిడ్ రూల్స్ ఇక్కడ వర్తించవా అంటూ సీపీని కడిగిపారేశారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణ పోలీసులు ఎంతకాలం ఊడిగం చేస్తారంటూ ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మరీ మాట్లాడడంతో పోలీసుల పరువు పోయింది. అర్వింద్ కు జవాబివ్వలేక, పోలీసుల దగ్గర సమాధానం లేక నిశ్శబ్దంగా ఉండిపోవాల్సి వచ్చింది. 

అర్వింద్ వాహనం ధ్వంసం, కత్తితో దాడి వంటి ఘటనల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై అర్వింద్ కు ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం. అసలేం జరిగిందో పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేసి ఓ రిపోర్టు కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడి తరువాత వెంటనే వచ్చిన రిపబ్లిక్ డే కి కూడా కేసీఆర్ అందుకే హాజరు కాలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తమిళిసై తన అధికారిక కార్యక్రమం కోసం పాండిచ్చేరికి హాజరవ్వాల్సి ఉన్న కారణంగా కేవలం రాజ్ భవన్ అధికారుల వరకే  అనుమతినిచ్చి  పతాకావిష్కరణను పూర్తిగా మినిమైజ్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికైనా  ముఖ్యమంత్రి  హోదాలో సీఎం కేసీఆర్ హాజరవ్వడం సంప్రదాయం. కానీ అలా జరగలేదు. సీఎం తన పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ప్రగతిభవన్ లోనే కానిచ్చేసినట్లు ఫొటోలు విడుదల చేశారు.  

వాస్తవానికి లోలోపల ఎన్ని విభేదాలున్నా అవన్నీ సైద్ధాంతికపరమైనవే. ఎక్కడా వ్యక్తిగతంగానో, పార్టీగతంగానో  తీసుకోవడానికి వీల్లేదు. రిపబ్లిక్ డే వంటి ఘనమైన జాతీయ పండుగ దినాల్లో జాతీయతా స్ఫూర్తిని తప్పనిసరిగా ప్రదర్శించాలంటున్నారు నిపుణులు. కానీ కేసీఆర్ మాత్రం రిపబ్లిక్ డే రోజు సైతం గవర్నర్ పతాకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్,  సీఎం ఒకేదగ్గర జాతీయ పండుగ జరుపుకొని ఉమ్మడిగా రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన వ్యాల్యుయేబుల్ మెస్సేజ్ కాస్తా ఇలా డైవర్ట్ అయిపోవడాన్ని బాధ్యత గల పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు.  కేంద్రం ప్రతినిధి అయిన గవర్నర్ తో కేసీఆర్ ఈ స్థాయిలో గ్యాప్ మెయింటెయిన్ చేయడం చాలా తీవ్రమైన రాజకీయ అంశంగానే భావిస్తున్నారు పరిశీలకులు. మరి.. ఈ గ్యాప్ ఈ మధ్యకాలంలో సమసిపోతుందా... లేక రానున్నరోజుల్లో పెనుతుఫాను లాంటి ఉపద్రవాలకు దారితీస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది.