హస్తిన వేదికగా నిధుల పంచాయతీకి ఢిల్లీకి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి హస్తిన బాట పట్టనున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హస్తిన వేదికగా నిధుల పంయాయతీ పెట్టేందుకు ఆయన ఈ హస్తిన పర్యటనకు సమాయత్తమౌతున్నారని సమాచారం. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి నుంచి మొదలు పెట్టి జాతీయ అజెండా వరకూ కేంద్రంలో మోడీ సర్కార్ ను దించే లక్ష్యంతో పలు ప్రతిపాదనలు చేసిన కేసీఆర్ ఈ సారి ఫెడరల్ స్ఫూర్తికి మోడీ తూట్లు పొడుస్తున్నారన్న నినాదంతో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు చేస్తారని పరిశీలకుల విశ్లేషణ.  

కేసీఆర్ బుధవారం నిర్వహించిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతిపై సమీక్షలో  జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, ప్రధాని గ్రామసడక్‌ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడంపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు ఉండగా కేంద్రం పెత్తనమేమిటన్నది ఆయన ప్రశ్న.

 రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం ఎమిటన్న కేసీఆర్  ఆజాదీ  అమృత్‌ మహోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో  రాష్ట్రాల స్వతంత్రాన్ని, హక్కులను కేంద్రం హరించడం సిగ్గు చేటన్నారు.  దీనిపై రాష్ట్రాలు సమైక్యంగా కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకతను చాటేందుకు ఈ సారి కేసీఆర్ హస్తిన బాట పట్టారన్న విశ్లేషకులు అంటున్నారు. శుక్రవారం హస్తినకు బయలు దేరుతున్న ఆయన రెండు మూడు రోజుల పాటు అక్కడే మకాం వేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పర్యటనలో ఆయన వివిధ జాతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే తన జాతీయ అజెండాపై చర్చించేందుకు పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.