కవిత క్షమాపణలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్!
posted on Oct 25, 2025 2:14PM

అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేయలేకపోయానంటూ కవిత బహిరంగంగా చెప్పిన క్షమాపణలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. తెలంగాణ జాగృతి తరఫున జాగృతి జనంబాట కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత శనివారం ప్రారంభించారు. ప్రారంభించడానికి ముందు ఆమె తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేయడంలో విఫలమయ్యామంటూ బీఆర్ఎస్ తరఫున క్షమాపణలు చెప్పారు. అధికారంలో ఉన్న పదేళ్లలో అమరుల ఆశయాల సాధన దిశగా సాగడంలో బీఆర్ఎస్ విఫలమైందనీ, అలాగే అమరుల కుటుంబాలకు న్యాయం చేయడంలోనూ, సరైన గౌరవం ఇవ్వడంలోనూ విఫలమయ్యామనీ అంగీకరించడం ద్వారా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు.
కల్వకుంట్ల బహిరంగ క్షమాపణ బీఆర్ఎస్ కు బిగ్ షాకే.. ఎందుకంటే.. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన అమరవీరులందరినీ తాము సముచితంగా గౌరవించామనీ, వారి కుటుంబాలకు అండదండగా నిలిచామనీ ఇంత కాలం బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తున్నది. అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇంత కాలం బీఆర్ఎస్ చెబుతూ వస్తున్నదంతా అవాస్తవమని తన బహిరంగ క్షమాపణలతో తేల్చేశారు. అమరుల కుటుంబాలకు రూ. కోటి సాయం కోసం పోరాడతానని ప్రకటించడం ద్వారా అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అమరులకు ఇచ్చింది శూన్యహస్తమేనని తేల్చేశారు.
కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ లో లేరు.. నిజమే.. కానీ తెలంగాణ ఉద్యమ సారథి, నేత బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధినేత అయిన కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత స్వయానా కుమార్తె.. ఆమే అధికారంలో ఉన్న సమయంలో తన తండ్రి, ఆయన ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ పరువును నిలువునా గంగలో కలిపేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కవిత కొత్తగా తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకుని రాజకీయాలు చేయడం ద్వారా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆమె టార్గెట్ మాత్రం బీఆర్ఎస్సేననీ, రాష్ట్రంలో ఆ పార్టీ బలాన్నీ, బలగాన్నీ తనవైపుకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆమె భవిష్యత్ కార్యాచారణ ఉండబోతున్నట్లు అవగతమౌతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.