ప్లీన‌రీకి క‌విత‌, హ‌రీష్ డుమ్మా.. క్లారిటీ వ‌చ్చేసిందా?

కేసీఆర్ త‌న‌య‌. ఎమ్మెల్సీ. మాజీ ఎంపీ. క‌ల్వ‌కుంట్ల క‌విత క‌నిపించ‌డం లేదు. టీఆర్ఎస్ 20ఏళ్ల ఆవిర్భావ వేడుక ప్లీన‌రీలో క‌విత‌ జాడ లేదు. అటు వేదిక‌పై గానీ.. ఇటు ప్ర‌తినిధుల గ్యాల‌రీలోగానీ.. అటు వీవీఐపీ సెక్ష‌న్‌లో కానీ క‌విత లేరు. ఏమ‌య్యారు? ఎక్క‌డున్నారు? ఎక్క‌డున్నా స‌రే.. ఇక్క‌డికి ఎందుకు రాలేదు. ప్లీన‌రీలో ఇదే హాట్ టాపిక్‌. హైటెక్స్‌కు వ‌చ్చిన టీఆర్ఎస్ నేత‌లంతా క‌విత గురించే చ‌ర్చించుకుంటున్నారు. క‌విత‌మ్మ ఎందుకు రాలేదంటూ గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి. 

క‌విత అనే కాదు.. కేసీఆర్ అల్లుడు, మంత్రి హరీశ్‌రావు సైతం ప్లీన‌రీలో ప‌త్తా లేరు. ఇటు క‌విత‌, అటు హ‌రీశ్‌రావుల గౌర్హాజ‌రీపై గులాబీ పార్టీలో ఇంట్రెస్టింగ్ చ‌ర్చ జ‌రుగుతోంది. హ‌రీశ్‌రావు విష‌యానికే వ‌స్తే.. ఆయ‌న హుజురాబాద్ ప్ర‌చారంలో బీజీగా ఉన్నారు అందుకే రాలేద‌ని అంటున్నారు. హుజురాబాద్ నుంచి హైద‌రాబాద్‌కు ఎంత దూరం? ఇలా వ‌చ్చి అలా క‌నిపించి.. వెళ్లిపోతే ఏమైంది? అని తిరిగి ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో టీఆర్ఎస్ భ‌వ‌న్ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి కూడా హ‌రీశ్‌రావును తీసుకెళ్ల‌లేదు కేసీఆర్‌. మిగ‌తా పార్టీ ప్ర‌ముఖులంతా హ‌స్తిన వెళ్లినా.. అల్లుడుని మాత్రం ఇక్క‌డే వ‌దిలేశారు. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత హ‌రీశ్‌ను శాశ్వ‌తంగా వ‌దిలించుకుంటార‌ని.. అందుకే ఢిల్లీ అయినా, హైద‌రాబాద్ ప్లీన‌రీ అయినా హ‌రీశ్‌రావుకు ఎంట్రీ లేదంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, క‌విత టాపిక్ మ‌రింత ఇంట్రెస్టింగ్‌. శనివారం క‌విత దుబాయ్‌లో ఉన్నారు. ఇప్పుడూ అక్క‌డే ఉన్నారు. ఆమెతో పాటు దుబాయ్ వెళ్లిన నిజామాబాద్ టీఆర్ఎస్ లీడ‌ర్లంతా ఆదివార‌మే తిరిగొచ్చేశారు. సోమ‌వారం ప్లీన‌రీకీ హాజ‌ర‌య్యారు. మిగ‌తా నాయ‌కులంతా వ‌చ్చారు కానీ, క‌విత మాత్రం తిరిగిరాలేదు. కావాల‌నే దుబాయ్‌లోనే ఉండిపోయారని అంటున్నారు. పార్టీ ప్రెస్టీజియ‌స్‌గా నిర్వ‌హిస్తున్న ద్విద‌శాబ్ది వేడుక‌ల్లో క‌విత లేక‌పోవ‌డం ప్లీన‌రీలో క‌ల‌క‌లం రేపుతోంది. ప్లీన‌రీలోనే కాదు.. హైద‌రాబాద్ అంతా పెద్ద ఎత్తున పెట్టిన ఫ్లెక్సీల్లో కానీ, ప్లీన‌రీ ప్రాంగ‌ణం, బ‌య‌ట‌గానీ పెట్టిన, క‌ట్టిన క‌టౌట్లు, జెండాల్లో ఎక్క‌డా క‌విత పేరు లేదు. అంటే.. క‌విత‌ను టీఆర్ఎస్ ప‌క్క‌న పెట్టేసిన‌ట్టేనా? క‌విత పార్టీకి ఏమీ కారా? ఆమె అవ‌స‌రం తీరిపోయిందా? ఆమె ఇక అక్క‌ర‌లేద‌నుకుంటున్నారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు. 

కేసీఆర్‌-కేటీఆర్‌ల‌తో క‌విత‌కు తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్న‌య్య‌కు రాఖీ క‌ట్ట‌లేదు చెల్లెమ్మ‌. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఈసారి బ‌తుక‌మ్మ ఆడ‌లేదు ఆ ఇంటి ఆడ‌బిడ్డ‌. చాలా కాలంగా తండ్రితో కానీ, అన్న‌తో కానీ క‌నిపించ‌లేదు క‌విత‌. ఇప్పుడు పార్టీ ప్లీన‌రీలోనూ క‌విత జాడే లేదు.. ఊసే లేదు.. క‌నీసం ఫ్లెక్సీ కూడా లేదు. అంటే.. క‌విత‌కు పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేసేశారా? ఆమెకు ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు మూసేశారా? ప్లీన‌రీలోకీ క‌విత‌కు ప్ర‌వేశం నిషేధించారా? ఇలా ప్లీన‌రీకి వ‌చ్చిన గులాబీ శ్రేణుల్లో ఒక‌టే గుస‌గుస న‌డుస్తోంది.