కర్ణాటక టాప్.. యూపీ లాస్ట్! వ్యాక్సినేషన్ లో ఏపీ అంతంతే.. 

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. టీకాల కొరత ఉన్నా అందుబాటులో ఉన్నంతవరకు సాధ్యమైనంత వేగంగా టీకాల పంపిణికి రాష్ట్రాలకు చర్యలు చేపట్టాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గురువారం వరకు దాదాపు 27 కోట్ల టీకాలు వేశారు. ఇందులో 21.58 కోట్ల మందిఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే మొత్తం జనాభాలో 15.74 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు లెక్క. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా సాగుతుండగా.. ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రం నెమ్మదిగా సాగుతోంది. జనాభా తక్కువగా ఉన్న చిన్న రాష్ట్రాల్లో స్పీడుగా టీకాల పంపిణి సాగుతుండగా.. పెద్ద రాష్ట్రాలు మాత్రం వెనకబడ్డాయి. 

వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో గోవా టాప్ ప్లేస్‌లో ఉంది. గోవాలో గురువారంఉదయం వరకు... ఆ రాష్ట్ర జనాభాలో 37.35శాతం మందికి కనీసం మొదటి డోసు వేశారు. 
గోవా తర్వాతి స్థానాల్లో సిక్కిం (37.29%), హిమాచల్ ప్రదేశ్ (30.35), త్రిపుర (29.07), కేరళ (26.23), గుజరాత్ (25.69), ఢిల్లీ (25.39) ఉన్నాయి.  వ్యాక్సినేషన్‌లో యూపీ, బీహార్, అసోం, ఝార్ఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి.  యూపీలో గురువారం వరకు కేవలం 8.53% మంది మాత్రమే టీకా వేసుకున్నారు. బీహార్‌లో 8.61, అసోంలో 11.26, ఝార్ఖండ్‌లో 11.64, తమిళనాడులో 12.10, పశ్చిమ బెంగాల్‌లో 14.16 శాతం మందికి వ్యాక్సిన్ వేశారు.

వ్యాక్సినేషన్ లో  తెలుగు రాష్ట్రాల పరిస్థితి  అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 19 శాతం మంది టీకా తీసుకోగా.. ఏపీలో 18శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పెద్ద రాష్ట్రాల్లో కర్నాటక మాత్రమే కాస్త మెరుగ్గా ఉంది. అక్కడ ఇప్పటి వరకు 22 శాతం మందికి టీకాలు వేశారు.  అయితే జాతీయ వ్యాక్సినేషన్ రేటు కంటే.. ఏపీ, తెలంగాణ వ్యాక్సిన్ రేటు ఎక్కువ ఉంది.