జగన్ పాలనలో ఏపీలో కడప రెడ్ల రాజ్యం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంలోకొంత ముందు వెనక అయినా, చివరకు అందరూ అనుకున్నదే,అనుమానించిందే,జరిగింది.మొదటినుంచి అందరూ అనుకున్నట్లుగానే 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి కెఎస్‌ జవహర్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎంఓలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న జవహర్‌రెడ్డి, సీఎస్‌గా 2024 జూన్‌ వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. ఆ ప్రకారంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆయనే సీఎస్‌గా ఉండబోతున్నారు. కాగా ప్రస్తుత సీఎస్‌ సమీర్‌శర్మ బుధవారం (నవంబర్ 30) రిటైర్‌ అయ్యారు. ఆయన స్థానంలో జవహర్‌రెడ్డి గురువారం(డిసెంబర్‌ 1) నుంచి కొత్త సీఎస్‌గా పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇంతవరకు అయితే ఓకే. అయితే, జవహర్‌రెడ్డి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం. సీనియారిటీ ప్రాధాన్యతా క్రమాన్ని తీసి  పక్కన పెట్టింది. ముందున్న మూడు బ్యాచ్‌ల అధికారులను కాదని, 1990 బ్యాచ్‌కు చెందిన జవహర్‌రెడ్డిని ముందు వరసలోకి తీసుకొచ్చింది. ఇలా, సీనియారిటీ పక్కన పెట్టి జూనియర్ అధికారిని ఎంపిక చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 

నిజానికి 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, 188 క్యాడర్‌కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్‌కు చెందిన కరికల్‌ వలెవన్‌ను కాదని, జవహర్‌రెడ్డిని సీఎస్‌గా ఎంపిక చేయడం అనేక అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. జవహర్‌ ‘రెడ్డి’ కోసం జగన్ ‘రెడ్డి’ రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారాలను వినియోగించుకుని ఆయన్ను వెనక నుంచి ముందుకు తీసుకురావడం, ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. అలాగే, జవహర్ రెడ్డికి ఉన్నప్రత్యేక అర్హత ఏమిటంటే, అది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. జవహర్ ‘రెడ్డి’ పేరులోనే పెన్నిది ఉందని,  ఆయన పేరులోని చివరి రెండు అక్షరాలే, ఆయనకున్న ప్రత్యేక అర్హతని, అటున్నారు. 

అయితే, ఇలా  జరగడం ఇదే మొదటిసారా, అంటే, లేదు. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు సీనియర్లను కాదని.. తమకు నచ్చిన వారిని సీఎస్‌లుగా నియమించిన సందర్భాలు లేక పోలేదు. నిజానికి, ఈ సంప్రదాయం ఒక్క ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాలలో చివరకు కేంద్రంలోనూ ఉన్నదే. ప్రధాని కార్యాలయం (పీఎంఓ) లో పేర్లను గమనిస్తే, కీలక పదవుల్లో గుజరాతీ బాబులే ఉంటారు. నిజానికి ఒక పీఎంఓలో కాదు, సీబీఐ, ఈడీ,సీఈసీ వంటి కీలక పదవుల్లో గుజరాతీలు కాదంటే నాగపూర్ వాసనలున్న అధికారులే ఉంటారు. అంతే కాదు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పదవుల్లో కొనసాగుతున్న అధికారులు అనేక మంది ఉన్నారు. అలాగే ఇతర మత్రుల కార్యాలయాల్లోను ఆయా మంత్రుల స్వరాష్ట్రానికి చెందిన, అందులోనూ అస్మదీయలే అధికంగా ఉంటారు. అలాగే, పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎస్ మొదలు ప్రధాన శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధిరులు అంతా బీహార్ నుంచే దిగుమతి అవుతారు.  

అయినా, ఇలా ముఖ్యమంత్రులు తమకు ఇష్టమైన, అనుకూలమైన అధికారులను నియమించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే అయినా ఇప్పటికే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్,రాష్ట్ర ప్రభుత్వం ‘అధికారు’ల పరిధిని రెండు అక్షరాలకు, కడప జిల్లాకు పరిమితం చేయడం చుట్టూ విమర్శలు వినిపిస్తున్నాయి. 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరో, ఏ జిల్లా వాసో వేరే చెప్పనక్కరలేదు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ముఖ్యమంత్రి స్వగ్రామం. ఇక అధికారుల విషయానికి వస్తే, తాజాగా సీఎస్ గా నియమితులైన జవహర్ రెడ్డి కడప జిల్లా వాసే. అలాగే రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ  కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి అదే కడప జిల్లా వాసి. అంటే రాష్ట్రంలో  సీఎం, ప్రభుత్వ వ్యవహారాలలో డిఫాక్టో సీఎంగా అభివర్ణించే సీఎస్, అలాగే అత్యంత కీలకమైన పోలీస్ బాస్ ముగ్గురూ ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లాకు చెందిన వారు.

ఒక  వైసీపీ ప్రభుత్వంలో ఆయన తర్వాత ఆయనంతటి వాడు, సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్దులైన ప్రభుత్వ ప్రధాన సహదారు, సజ్జల రామ కృష్ణా ‘రెడ్డి’, కడప ‘జాతి’ రత్నమే.  గత ఫిబ్రవరిలో జగన్ రెడ్డి ప్రభుత్వం, అంతవరకు రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌’ను తప్పించి, కసి’రెడ్డి’ని పోలీస్ బాస్ ను  చేసింది. ఆయన కున్న ప్రత్యేక అర్హత కూడా ఆ రెండు అక్షరాలు ప్లస్ మీది తెనాలి ..మాది తెనాలి అన్నట్లుగా కడప రిలేషన్, అంటారు.  అయితే ఎవరు ఏమనుకున్నా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు మత పరంగా, ఆయన విశ్వసించే క్రైస్తవ మతానికి, కులం పరంగా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఆవి ఆరోపణలు ఆరోపణలు కాదు అక్షర సత్యాలని తేలిపోయింది.