కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవేలో కదలిక

 

నాలుగేళ్లుగా నిలిచిపోయిన కడప రేణిగుంట  గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ మళ్లీ కదలికలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వ చొరవతో కేంద్ర వైల్డ్‌లైఫ్ బోర్డు అనుమతులు లభించడంతో రూ.3,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌కు ఫోర్‌లేన్ హైవే విస్తరణ పనులు ఇప్పుడు మళ్లీ ఊపందుకునే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ చొరవతో ఈ కీలక ప్రాజెక్ట్‌కు కేంద్ర వన్యమృగ సంరక్షణ బోర్డు  ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది.


రూ.3,150 కోట్ల వ్యయంతో రెండు దశలుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్‌లో మొదటి దశకు ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు లభించగా, రెండో దశకు తాజాగా వన్యమృగ సంరక్షణ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు దశల్లో పనులు కడప నుండి భాకరాపేట, ఒంటిమిట్ట, పెదపల్లె, నందలూరు, రాజంపేట, ఓరంపాడు వరకు మొదలు కానున్నాయి.మొదటి దశలో పనులు కొనసాగనున్నాయి. రెండో దశలో పుల్లంపేట, అయ్యపురెడ్డిపల్లి, బాలాయపల్లి, మామండూరు, రేణిగుంట వరకు విస్తరణ జరుగనుంది.

 *అభయారణ్యాల అనుమతులు సవాలు

ఈ ప్రాజెక్ట్‌లో శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యాల పరిధిలోని మొత్తం 133 హెక్టార్ల భూములను వినియోగించాల్సి రావడంతో అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం నిరంతర చర్చలతో సమస్యను పరిష్కరించి, చివరికి బోర్డు నుండి 20 షరతులతో కూడిన ఆమోదం పొందింది.

*వన్యప్రాణులకు సురక్షిత మార్గాలు

అటవీ  ప్రాంతాల గుండా సాగే రహదారుల వద్ద వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు ఎత్తైన అండర్‌పాస్‌లు నిర్మించాలని బోర్డు ఆదేశించింది. అలాగే వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించింది. గత నాలుగేళ్లుగా కదలని ఈ ప్రాజెక్ట్‌ను కదిలించడంలో కూటమి ప్రభుత్వ పాత్ర కీలకమైంది. 

కేంద్రంతో జరిగిన పునరావృత చర్చలు, సాంకేతిక బృందాల పరిశీలనల ఫలితంగా చివరికి ఈ ప్రాజెక్ట్‌కు ప్రాణం పోసినట్లు అయింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో మరో రెండు నెలల్లోనే ఫోర్‌లేన్ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే వచ్చే ఏడాది చివరినాటికి కడప–రేణిగుంట హైవే నాలుగు లేన్లుగా రూపుదిద్దుకోనుంది.

*అధికారుల పరిశీలన

 కడప–రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారులు, కూటమి ప్రతినిధులు రెండు రోజుల క్రితం పరిశీలించారు. సిద్దవటం మండలంలోని గ్రామ శివారులోని జేఎంజే కాలేజ్ సమీపం నుండి కనుములోపల్లి, భాకరాపేట, మిట్టపల్లి, మాధవరం గ్రామాల అటవీ ప్రాంతాల వరకు అధికారులు, నాయకులు పరిశీలనలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి (వాసు)  హైవే అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రూ.3,150 కోట్ల వ్యయంతో రెండు దశలుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో మొదటి దశకు ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు లభించగా, రెండో దశకు తాజాగా వన్యమృగ సంరక్షణ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.  రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తక్షణమే తెలియజేయాలని  తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu