బతకనేర్చిన తనమంటే ఇదేనా జూనియర్?

బతకనేర్చిన వాడు అనిపించుకోవడం చాలా సులువు. అయితే  ఆ మాట తిట్టుగానూ, పొగడ్తగానూ కూడా వాడుతుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ బతకనేర్చినవాడుగా అభివర్ణిస్తున్నారు. సందర్భాన్ని బట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అందరూ అంటున్న ఈ మాట ఏ విధంగా చూసుకున్నా కితాబని అనుకోవడానికి లేదు. రాజకీయాలకు చాలా కాలం నుంచీ జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు.

ఎప్పుుడో 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథంపట్టారు. అన్నగారు ఎన్టీఆర్ మనవడిగా ఆయనను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు జనం ఎగబడ్డారు. ఆయన ప్రచారం బ్రహ్మాండంగా క్లిక్ అయ్యింది. కారణాలేమైతేనేం.. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలైంది. అంతే ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు కనీసం చూడను కూడా చూడలేదు. పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయారు. సినిమాలలో బానే క్లిక్ అయ్యారు. ఎన్టీఆర్ మనవడిగా ఆయన సినీమా లాంఛ్ బ్రహ్మాండంగా జరిగింది. బాల రామాయణంలో రాముడిగా  మెరిసాడు. ఆ తరువాత కొంత  పెద్దయ్యాకా బ్లాక్ బస్టర్ లాంటి హిట్లతో స్టార్ హీరో హోదా సంపాదించుకున్నారు. ఆయన ఒక హీరో... ఆయన హీరోయిజం చూసే అనేక మంది ఎన్టీఆర్ కు వీరాభిమానులయ్యారు.

హీరోయిజం తెరకే పరిమితమైందా అన్న విమర్శలను ఇప్పుడు జూనియర్ ఎదుర్కొంటున్నారు. ఏ మనిషైనా సరే కూడలి వచ్చినప్పుడు అటో ఇటో ఎటో అటు నడవాలి. ఆ నడక నీ దారి ఏమిటన్నది  తేలుస్తుంది. అంతే కానీ అటూ ఇటూ కాకుండా గోడమీద బల్లిలా ఉండిపోతానంటే.. అది బతక నేర్చిన తనం అవుతుందేమో కానీ మనిషి తనం, ధీరోదాత్త గుణం అని ఎంత మాత్రం అనిపించుకోదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారూ వ్యతిరేకిస్తుంటే.. ఆయన మనవడిగా ఎన్టీఆర్ స్పందన గోడమీద పిల్లి వాటాన్నే స్ఫురింప చేసింది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఎన్టీఆర్ మనవడు అన్న హోదాతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో స్పందించిన తీరు అటూ ఇటూ కాని విధంగా ఉందనీ, తన తాత ద్వారా స్టార్ డమ్ వచ్చేసింది కనుక ఇప్పుడు తన తాత ఇమేజ్ ను మసకబార్చే యత్నాలు చేస్తున్న వారిని ఖండించి వారికి దూరమవ్వడం బతక నేర్చిన తనం కాదనుకున్నారా అన్నట్లు ఆయన స్పందన ఉంది.  

ఆయన స్పందన ఆయన హీరోయిజం కేవలం వెండితెరకే పరిమితం అని ఒ  తేటతెల్లం చేసేసింది. తాత గౌరవం కంటే.. తన సినీ కెరీర్ ను కాపాడుకోవడమే ఎన్టీఆర్ కు ముఖ్యమని తేలిపోయింది హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఎన్టీరామారావును , వైఎస్‌తో పోలుస్తూ జూనియర్ చేసిన ట్వీట్ వెనుక ఉన్నది జగన్  అని  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పును తప్పుపట్టేవారికి చెక్ అన్నట్లుగా  జగన్ సూచన మేరకు, జగన్ కు రాజకీయంగా ప్రయోజనం చేకూరేలా ఎన్టీఆర్ వ్యవహరించారన్న ఆరోపణలకు వెల్లువెత్తుతున్నాయి.  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో జూనియర్ స్పందనను సమర్ధిస్తున్న వారంతా వైసీపీ వర్గీయులే కావడమే ఇందుకు ప్రబల నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ స్పందనను తమ నిర్ణయానికి ప్రజా మద్దతుగా చూపించుకోవాలన్న వైసీపీ వ్యూహం ప్రకారమే ఇదంతా జరిగిందన్న విశ్లేషణలకు కూడా  వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ స్పందనను బలపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.  ఎన్టీఆర్-వైఎస్‌ను ఒకేగాట కట్టిన ఎన్టీఆర్ స్పందన పట్ల తెలుగుదేశం, ఎన్టీఆర్ అభిమానులే కాదు.. తెలుగు వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ప్రభావం ఆయన సినిమాల మీద కూడా పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. అంటు ఇప్పటికిప్పుడు బాయ్ కాట్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ హ్యాష్ టాగ్ క్యాంపెయిన్ ప్రారంభం కాకున్నా... సినిమా బాగోగులతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ మనవడు అన్న అభిమానంతో ఆయన సినిమాలకు మద్దతు తెలిపే పరిస్థితి ఇక ముందు ఎంత మాత్రం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  
సరే.. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ మార్పు వ్యవహారంలో, ఎన్టీఆర్-వైఎస్‌ను జూనియర్ ఒకే గాట కట్టడాన్ని  సోషల్‌మీడియాలో టీడీపీ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తోంది. రాజకీయ ఓనమాలు తెలియని జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఔన్నత్యాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. పేదవాడి అన్నం గిన్నెలా ప్రజల హృదయాలలో అనితర సాధ్యమైన సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ ఎవరికీ తలవంచని ధీరోదాత్తుడనీ, ఆయన మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రతి అడుగూ భయమే, ప్రతి మాటా భయమే అన్న రీతితో వ్యవహరిస్తున్నారనీ అంటున్నారు. జూనియర్ తన అనుంగు స్నేహితుడిగా చెప్పుకునే కొడాలి నాని అసెంబ్లీలో భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దీటుగా ఖండించడానికి కూడా భయపడిన సంగతిని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఆ తాత మనవడిని అంటూ అవకాశం వచ్చిన ప్రతి సారీ ప్రగల్బాలు పలికే జూనియర్.. ఆ తాత గౌరవాన్ని తగ్గించేలా ఆయన పేరు మీద ఉన్న హెల్త్ వర్సిటీ పేరు మారుస్తుంటే దీటుగా స్పందించడానికీ వెనుకాడిన విషయాన్ని ఎత్తి చూపుతూ  విమర్శలు సంధిస్తున్నారు.  అలాగే తన తాత పేరుమీద ఉన్న అన్న క్యాంటీన్లను రద్దు చేయడమే కాకుండా, ఆ పేరుతో క్యాంటీన్లు నడుపుతున్న వారిపై దాడిచేసి,వాటిని ధ్వంసం చేసిన పార్టీ నిర్ణయాన్ని సమర్ధించడమేమిటని నిలదీస్తున్నారు.    ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు  మార్పు వ్యవహారంలో జూనియర్  స్పందన ఆయనను ఎవరికీ కాకుండా చేసిందనడంలో సందేహం లేదు.