జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక...బీజేపీ త్రిసభ్య కమిటీ

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపిక కోసం నాయకులు, పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు  త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులో  మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. 

మరోవైపు కాషాయ పార్టీ నుంచి బరిలో దిగేందుకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన విషయం తెలిసిందే. అదేవిధంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీ లత టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

మరోవైపు  బీఆర్‌ఎస్  పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత  బరిలో నిలుస్తుందని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించారు. హస్తం పార్టీ నుంచి  నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, వి.హనుమంత రావు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ అక్టోబర్ 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu